పార్టీ స్థాపించడం, పేరున్న నేతలను, ప్రజలను ఆకర్షించడం, పార్టీ నిర్వహణ, ఎన్నికలలో గెలుపు… ఇలా ప్రతీది చాలా కష్టమే. కానీ మన రాజకీయ పార్టీలు వీటన్నిటికీ విరుగుడు ఫార్ములా కూడా కనిపెట్టాయి. అదే… ఎన్ని ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు ఎదురవుతున్నా తట్టుకొని నిలబడుతూ రాజకీయాలలో కొనసాగడమే.
ఈ క్రమంలో వారి విధానాలు సరైనవైనా కాకపోయినా రాజకీయాలలో కనీసం ఓ 10-15 ఏళ్ళు ధృఢంగా నిలబడగలిగితే చాలు… అదృష్టం కలిసివస్తుంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఎకంయ్యి వాటితో చెయ్యి కలుపుతాయి. ఓ బలహీన క్షణంలో ప్రజలు ఆ పార్టీని గెలిపించేస్తారు.
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇక రాష్ట్రంలో మరే పార్టీ మనుగడ సాగించలేదనే అందరూ అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నిలబడింది. ఎన్నికలలో గెలిచింది. బీజేపి అధిష్టానం గోడ మీద పిల్లిలా వ్యవహరించకపోయి ఉంటే తెలంగాణలో అదే అధికారంలోకి వచ్చి ఉండేది.
ఇక్కడ ఏపీలో జగన్ పదేళ్ళ పాటు ఆటుపోట్లు తట్టుకొని రాజకీయాలలో నిలబడ్డారు. అక్రమాస్తుల కేసులలో జగన్ జైలుకి వెళ్ళి బెయిల్‌పై బయట ఉన్నారని తెలిసి ఉన్నా, ప్రజలు చంద్రబాబు నాయుడుని కాదని ఆయనని గెలిపించారు కదా?
అదే విదంగా పవన్ కళ్యాణ్ కూడా అనేక అవమానాలు, అవహేళనలూ భరిస్తూ రాజకీయాలలో స్థిరంగా నిలబడ్డారు. ముందే చెప్పుకున్నట్లు ఎన్నికల సమయానికి ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఏకం అయ్యాయి. ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. ఓట్లు వేసి గెలిపించారు.
కనుక ఆటుపోట్లు తట్టుకొని రాజకీయాలలో కొనసాగగలిగితే చాలు. ప్రజలు ఆ పార్టీని, అధినేతని ప్రత్యామ్న్యాయంగా భావిస్తారు. కనుక మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూనే ఉంటారు.
ఆ పార్టీ ట్రాక్ రికార్డ్, ఆ నేతల సమర్దత లేదా అవినీతి బ్యాక్ గ్రౌండ్ ఏవీ కూడా ఈ ఫార్ములాకు అవరోధం కాబోవు. కనుక జగన్ ఇదే ఫార్ములాని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నట్లు భావించవచ్చు. విజయవంతమైన ఈ ఫార్ములా ప్రకారం మళ్ళీ ఏదో రోజు జగన్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు.







