సినిమాలు తీయడం వచ్చిన మహామహులంతా ప్రేక్షకుల తీర్పు ముందు తలవంచాల్సిందేనని “బ్రహ్మోత్సవం” సినిమా మరోసారి చాటిచెప్పింది. 156 నిముషాలు నిడివి గల ‘బ్రహ్మోత్సవం’ సినిమాపై మహేష్ బాబు అభిమానులతో సహా సినీ ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా చాలా నెమ్మదిగా సాగుతుందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం కావడంతో, చిత్ర యూనిట్ ఆ డ్యామేజ్ కు సంబంధించి దిద్దుబాటు చర్యలకు దిగుతోందని సమాచారం.
మొత్తం సినిమాలో దాదాపు 12 నిముషాలు నిడివి గల సినిమాను కటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే అసలు ప్రేక్షకుల ముందుకు వచ్చే ముందు ఒకటికి వంద సార్లు చూసుకునే చిత్ర యూనిట్ ‘ఎడిటింగ్’ విభాగంలో ఎలాంటి విధులు నిర్వహిస్తోందన్నది తెలియని ప్రశ్న. అంటే అంత కష్టపడి సినిమాను నిర్మించే చిత్ర యూనిట్ సభ్యుల కన్నా, మూడు గంటలలో సినిమాను జడ్జ్ చేసే ప్రేక్షకులకే సినిమా గురించి ఎక్కువ తెలుసన్న మాట.
ఇది ఒక్క ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవల విడుదలైన ప్రతి పెద్ద సినిమా పరిస్థితి ఇంతే. మొన్న కాక మొన్న “24” సినిమా ట్రిమ్మింగ్ చేయగా, అంతకు ముందు “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా కూడా ఇలాంటి కోతలకు గురైన విషయం తెలిసిందే. మరి ఎడిటింగ్ విభాగంలో నిపుణులు మరియు సినిమా కధను ఎంచుకున్న దర్శకుడు ఎలాంటి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారో ఒక్కసారి సదరు ప్రతిభావంతులంతా పునరాలోచించుకోవాలన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది.



