తన అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరుపుకోవాలని ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతని కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల వేళ 19 సంవత్సరాల ప్రశాంత్ అనే వీరాభిమాని కరెంట్ షాక్ తో మరణించిన ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. ఈ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఓ ప్లెక్సీని కడుతున్న ప్రశాంత్, ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను తాకాడు. దీంతో షాక్ కొట్టి పైనుంచి కిందపడిన ప్రశాంత్, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే హీరో ప్రభాస్ పుట్టిన రోజు బహుమతిగా విడుదలైన ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ మోషన్ పోస్టర్ సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. “భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి” అంటూ సాగే ఈ పాటలో బ్యాక్ గ్రౌండ్ సంగీతం, లిరిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. యూ ట్యూబ్ లో విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ వీడియోకు నెటిజన్లు పట్టం కడుతున్నారు. 14 సంవత్సరాల క్రితం ‘ఈశ్వర్’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి ‘వర్షం’తో స్టార్ గా మారిన ప్రభాస్ కెరీర్ లో “బాహుబలి” అతి పెద్ద విజయం అన్న సంగతి తెలిసిందే.



