ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ‘మాతృ భాష- హిందీ భాష గురించి వెల్లడించిన అభిప్రాయాలపై సహజంగానే అనేక విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్‌ని విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే ప్రకాష్ రాజ్ కూడా వారిలో ఒకరు.
“మాతృభాష ఇంట్లో మాట్లాడుకోవడానికి సరిపోతుంది. మన ఇంటి సరిహద్దులు దాటితే మన రాజ్య భాష హిందీయే అవసరం,” అనే పవన్ కళ్యాణ్ మాటలను ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ “ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా.. ఛీ.. ఛీ.. # జస్ట్ ఆస్కింగ్,” అని ట్వీట్ చేశారు.
ఆయనకు పవన్ కళ్యాణ్ అభిమానులు అంతకంటే ఘాటుగానే బదులిచ్చారు. “ఒకప్పుడు రెండు భాషలు (మాతృభాష, ఇంగ్లీష్) చాలన్నట్లు మాట్లాడిన మీరు తర్వాత తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలు నేర్చుకొని సినిమాలు చేస్తున్నారు. హిందీ వద్దనుకున్నప్పుడు ఎందుకు నేర్చుకున్నారు?ఇన్ని భాషలు నేర్చుకోవడం వలననే కదా మీకు ఇంత గుర్తింపు లభించింది?” అని విమర్శించారు.
వారి వాదన నిజమే కావచ్చు. కానీ ప్రకాష్ రాజ్ చెప్పిన పాయింట్ వదిలేసి ఎదురుదాడి చేశారు. ప్రకాష్ రాజ్ మొదటి నుంచి మత రాజకీయాలు చేసే బీజేపీని, ఆ కారణంగా ప్రధాని మోడీని వ్యతిరేకిస్తున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శిస్తుంటారు కూడా.
పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ మాయలో పడి ఓసారి సనాతన ధర్మ పరిరక్షణ అని మరోసారి హిందీ భాష అంటూ మాట్లాడుతున్నారని ప్రకాష్ రాజ్ అభిప్రాయం.
పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టి పనిచేసి ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా తన సమర్ధత నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా ఈవిదంగా బీజేపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో పావుగా మారడం అవసరమా? అని అడిగారు.
ఓ సాటి నటుడుగా ఆయన పవన్ కళ్యాణ్ హితవు కోరే ఈ మాటలు చెప్పారనుకోవచ్చు. ప్రకాష్ రాజ్ మాటలు కాస్త చేదుగా, కటువుగా అనిపించినప్పటికీ అవి వాస్తవమేనని అందరికీ తెలుసు.
ఎన్నికలలో జనసేనని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కనుక ఆయన శ్రమకు తగిన ఫలితం లభించిందని చెప్పవచ్చు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో పదవి, అధికారం రెండూ ఉన్నందున ఆయన ఎలా ఉన్నా, ఏం చేసినా, ఏం చేయకపోయినా సాగిపోతుంది.
కానీ జగన్ చెప్పినట్లు ‘కళ్ళు మూసుకుంటే’ మిగిలిన 4 ఏళ్ళు గిర్రున తిరిగిపోతాయి. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు ఈ పదవి, అధికారం వలన ఉపయోగం ఉండదు. ఈ 5 ఏళ్ళలో ఆయన పనితీరు, చేసిన పనులు, పార్టీని బలోపేతం చేసుకోగలిగారా లేదా?వంటి వాటి ఆధారంగానే ప్రజలు తీర్పు ఇస్తారు.
కనుక బీజేపీ మాయలో పడి, దాని రాజకీయాల కోసం ఈ పుణ్య కాలాన్ని వృధా చేసుకోవద్దని ప్రకాష్ రాజ్ ఇదివరకు పవన్ కళ్యాణ్‌కి హితవు పలికిన సంగతి, ఇప్పుడు ఆయనపై ఎదురుదాడి చేస్తున్నవారికి తెలిసి ఉండకపోవచ్చు.
హిందీ విషయంలో పవన్ కళ్యాణ్ మాటలు వాస్తవమని అందరికీ తెలుసు. కానీ తెలుగు ఇంటి గడప వరకు మాత్రమే పనికి వస్తుందనే మాట పట్టుకొని కొందరు విమర్శించగా, పవన్ కళ్యాణ్‌ని బీజేపీ కోణంలో నుంచి చూస్తూ ప్రకాష్ రాజ్ విమర్శించారని చెప్పవచ్చు. కానీ ఆయన హిందీతో సహా అనేక భాషలు నేర్చుకొని ఆయా భాషలలొ నటిస్తున్నారు కూడా. కనుక ఆయనని హిందీ ద్వేషి అని కూడా అనలేము.
ఇలాంటి అవసరం లేని ఓ అంశంతో రాజకీయాలు చేసే బదులు దేశానికి, సామాన్య ప్రజలకు పనికి వచ్చే పనులు చేయడంపై దృష్టి పెడితే బాగుంటుంది కదా? ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్!




