వోల్వో రేసులో ఆర్టీసీ ఎక్కడ?

Private Travels Overtake RTC in Andhra and Telangana

ప్రైవేట్ టీవీ ఛానల్స్ వచ్చి దూరదర్శన్‌ని, ప్రైవేట్ టెలీకాం కంపెనీలు వచ్చి బీఎస్ఎన్ఎల్‌ని మింగేసినట్లే, వొల్వో బస్సులతో ప్రైవేట్ ట్రావెల్స్ ఏపీఎస్, తెలంగాణ ఆర్టీసీని కూడా మింగేస్తున్నాయి.

ఏపీఎస్, తెలంగాణ ఆర్టీసీలు నగరాలు పట్నాలలో సిటీ బస్సులు, మారుమూల గ్రామాలకు గోతులు పడిన రోడ్లపై పల్లె వెలుగు బస్సులను నడిపిస్తుంటే, ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు సువిశాలమైన రోడ్లపై హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖ, ముంబై వంటి మహా నగరాలకు రివ్వున దూసుకుపోతుంటాయి.

ADVERTISEMENT

రెండు ఆర్టీసీ సంస్థలపై మహిళల ఉచిత ప్రయాణ భారం ఉండనే ఉంది. కనుక కష్టాలు, నష్టాలు, సమస్యలు… అన్నీ ఆర్టీసీ అనుభవిస్తుంటే, సౌకర్యాలు, లాభాలు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు అనుభవిస్తున్నాయి.

అయితే ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలతో రెండు రాష్ట్రాలలో ఆర్టీసీలు పోటీ పడలేని దుస్థితిలో ఉన్నాయా?అంటే అవును… కాదని రెండు సమాధానాలు చెప్పవచ్చు.

ఆర్టీసీలో ప్రభుత్వ జోక్యం, రాజకీయ నిర్ణయాల ప్రభావం, నిధుల కొరత, ఆర్ధిక సమస్యలు, ఉద్యోగుల సమస్యలు వంటివాటి వలన పోటీ పడలేకపోతోందని చెప్పవచ్చు.

కానీ రెండు ఆర్టీసీల వద్ద కూడా ఇంద్ర, గరుడ వంటి అనేక వొల్వో బస్సులున్నాయి. నేటికీ అవి సేవలు అందిస్తూనే ఉన్నాయి.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పోలిస్తే ప్రమాదాల శాతం కూడా తక్కువ. ఎక్కడికక్కడ డిపోలు, బస్టాండ్స్ ఉండటం వలన ప్రజలకు అందుబాటులో ఉంటాయి. భద్రత ఉంటుంది. ఛార్జీలు తక్కువ… సౌకర్యాలు కూడా పర్వాలేదు. ఆర్టీసీకి ఉన్నన్ని బస్సులు, డిపోలు, ఉద్యోగులు, ఆస్తులు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలకు లేవు.

అయినా ఈ వొల్వో రేసులో రెండు ఆర్టీసీలు ఎందుకు ఓడిపోతున్నాయంటే సంస్థలో కొందరు అవినీతిపరులైన అధికారులు, సిబ్బంది వాటిని గెలిపించేందుకే ఆర్టీసీని ఓడించుకుంటున్నారని చెప్పక తప్పదు.

ఆర్టీసీ ఉన్నతాధికారుల మూస ధోరణి, రాజకీయ సంబంధాలు వంటివి కూడా సంస్థకు నష్టం కలిగిస్తున్నాయి. పండగలకు, పబ్బాలకు, శబరిమల, మేడారం జాతరకో ప్రత్యేక బస్సులు నడిపించడమే చాలా గొప్ప విషయమని అనుకుంటారు.

కర్నూలు బస్సు ప్రమాదం నేపధ్యంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేయడమే చాలా మంచిది. ప్రాణాలు పోగొట్టుకోకుండా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని గట్టిగా నొక్కి చెప్పే ప్రయత్నం చేయవు.

ఫేస్‌బుక్‌లో ఏపీఎస్ ఆర్టీసీ బసస్ పేరుతో ఓ పోస్ట్ పెట్టారు. దానిలో ఏపీఎస్ ఆర్టీసీ 2010లోని గరుడా బి7ఆర్ వోల్వో విజయవాడ డిపోకు చెందిన ఆ అందమైన బస్సు ఒకప్పుడు విజయవాడ-బెంగళూరు రూట్‌పై రాజులా నడిచేది. ఆ ప్రయాణాలు కేవలం ప్రయాణాలు కాదు… అవి జ్ఞాపకాలు, భావాలు, మరియు ఏపీఎస్ ఆర్టీసీ బంగారు రోజుల మాధుర్యంతో నిండి ఉండేవి,” అని పెట్టింది.

కానీ ఏపీఎస్ ఆర్టీసీ ఆ ప్రయాణాలను, ప్రయాణికులకు ఆ మధురానుభూతులను ఎందుకు కొనసాగించడం లేదు? ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలతో పోటీ పడకుండా ఆర్టీసీని ఎవరు అడ్డుకుంటున్నారు? ఇలాంటి సందర్భాలలో ఒకప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం ఏమైనా గొప్ప విషయమా?అనే ప్రశ్నలకు అధికారులకే బాగా తెలుసు.

ప్రజల భద్రతకు ప్రభుత్వాలు నిజంగానే ప్రాధాన్యం ఇస్తున్నట్లయితే ఆర్టీసీపై అనవసరమైన భారాలు మోపే బదులు అది ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలతో పోటీ పడేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తే మంచిది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాదు ఆర్టీసీకి రాజకీయాల నుంచి స్వేచ్చ, విముక్తినివ్వాలి.

చివరిగా ఒక మాట: ఆర్టీసీకి కూడా ఇస్రోలా సొంతంగా నిలబడేందుకు ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తే, అదే ప్రభుత్వాలను పోషించే స్థాయికి తప్పక ఎదుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories