పూరీ – మహేష్ బాబు కాంభినేషన్ లో మూడవ చిత్రంగా ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ‘పోకిరి’ పుట్టినరోజు సందర్భంగా పూరీ నుండి ఒక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్ డేట్స్ లేకపోగా, ఓ పక్కన మహేష్ తో చేయబోతున్న దర్శకుల జాబితా పెరిగిపోతోంది కానీ, అందులో పూరీ లేకపోవడమే అసలు ట్విస్ట్. దీంతో తాజాగా ఈ విషయంపై పూరీ చెప్పిన సమాధానం పలు సందేహాలను లేవనెత్తుతోంది.
‘జనగణమన’ స్క్రిప్ట్ మహేష్ కు నచ్చిందని చెప్పిన పూరీ, అయితే ఆ తర్వాత ప్రిన్స్ వైపు నుండి ఎలాంటి కబురు లేకపోవడంతో ప్రస్తుతం వేచిచూసే ధోరణిలో ఉన్నట్లుగా తెలిపారు. ఇదే సందర్భంలో ఈ కధతో ఖచ్చితంగా సినిమా ఉంటుందని, అయితే అది ఎవరితో ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని అనడంతో, ఇక పూరీ నిరీక్షించే వైఖరిలో లేరన్న విషయం స్పష్టమైంది. ఒకరికి నచ్చకపోతే మరొకరితో కధలను తెరకెక్కిస్తాను తప్ప, కధలను మార్చే ఉద్దేశం తనకు లేదని కుండబద్దలు కొట్టారు.
అలా చేయలేదు కాబట్టే, ముందుగా ‘పోకిరి, ఇడియట్’లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు ‘పోకిరి,’ మరో హీరోకు ‘ఇడియట్’ కధలు చెప్పాను, వారు నచ్చలేదన్నారు. తన వద్ద ఇంకా 10 సంవత్సరాలకు సరిపయే కధలు ఉన్నాయి, అవి ఎవరితో ఎప్పుడు వస్తాయో చెప్పలేనని అన్న పూరీ మాటల ఆంతర్యం ఏమిటంటే… మహేష్ గనుక ‘జనగణమన’ నుండి అవుట్ అయితే, టైటిల్ మార్పుతో అదే కధను జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించవచ్చన్నది ట్రేడ్ వర్గాల టాక్.



