‘టక్కరి దొంగ’లో పాపులర్ అయిన ఈ పాట మహేష్ బాబుకు సినిమా పరంగా సూటవ్వగా, రామ్ గోపాల్ వర్మ వ్యక్తిత్వానికి సరిగా సరిపోతుందని చెప్పనవసరం లేదేమో! దానికి తాజా ఉదాహరణే ఈ రోజు విడుదలైన “లోఫర్” సినిమా. పూరీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా మేకింగ్ పట్ల విశ్లేషకులు పెదవి విరిచేసారు, అలాగే పూరీపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘ముకుంద, కంచె’ సినిమాల తర్వాత మొదటిసారి మాస్ సినిమా అటెంప్ట్ చేసిన వరుణ్ తేజ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయారు. ఇక, హీరోయిన్ దిశా వంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదని తేల్చేసారు. దాదాపుగా అన్ని విశ్లేషణలు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచగా, రాంగోపాల్ వర్మ మాత్రం కాస్త డిఫరెంట్ గా ‘లోఫర్’ను ఆకాశానికేత్తేసారు.
“ఇప్పడే ‘లోఫర్’ సినిమాను అని ప్రారంభించిన వర్మ ట్వీట్ల వెల్లువలో… ముకుంద, కంచె తర్వాత ‘లోఫర్’లో వరుణ్ అభినయాన్ని చూసి తనకు డౌట్ లేదని, ఇక తనే తర్వాతి మెగాస్టార్ అని ప్రశంసలతో ముంచెత్తారు. రేవతి, పోసాని బాగా చేసారని, సునీల్ కశ్యప్ అందించిన నేపధ్య సంగీతం బాగుందని, ప్రస్తుతం వస్తున్న హీరోయిన్లలో దిశా బెస్ట్ హీరోయిన్ అని, ఆమె పాత్ర కొంత పరిధి వరకే పరిమితం అయ్యిందని, ఫైనల్ గా ‘లోఫర్’ ద్వారా వరుణ్ తేజ్ కు పూరీ మెగా స్టార్ డం ను అందించి, మెగా హీరోలలో వరుణ్ ను అందరి కంటే ముందు వరుసలో నిలబెట్టారని” తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచారు వర్మ.
అయితే “లోఫర్”పై పబ్లిక్ టాక్ గానీ, వెబ్ మీడియా టాక్ గానీ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న టాక్ గానీ… వర్మ వ్యక్తపరిచిన అభిప్రాయాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. పది మంది వ్యక్తపరిచే భావాలకు పూర్తి విరుద్ధంగా వర్మ నైజం ఉంటుందని మరోసారి నిరూపించుకున్నారు. అలాగే మీడియాను తన వైపుకు తిప్పుకోవడంలో వర్మను మించిన వారు కూడా లేరని ఈ సందర్భంగా సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక, వరుణ్ కెరీర్ లో మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్న ‘కంచె’ను కూడా ‘లోఫర్’ అందుకుంటుందో లేదోనన్న సందేహాలు ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్నాయి. తొలిరోజే అంతంత మాత్రంగా ఉంటే, రెండవ రోజు ‘బాజీరావు మస్తానీ, దిల్ వాలే’ సినిమాలు విడుదలలు ఉండడంతో… ‘లోఫర్’కు వచ్చిన టాక్ రీత్యా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందేనని ట్రేడ్ పండితులు అంటున్నారు.





