కొన్ని రాజకీయ బంధాలకు వివరణలు, నిర్వచనాలు అవసరం ఉండదు. ఒక్క ఫోటోతో మొత్తం స్టోరీ అర్థమైపోతుంది. అటువంటిదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో కూడా.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు జార్జి రెడ్డి. ఆయన కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి. ఆయన కుమార్తె శ్రేయరెడ్డి వివాహం గురువారం చెన్నైలోని లీలా ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
సొంత మేనకోడలు వివాహానికి యలహంక ప్యాలస్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి, అన్న మనుమరాలి వివాహానికి సతీసమేతంగా హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇది వారి కుటుంబ వ్యవహారం కనుక ఇప్పుడీ చర్చ అనవసరం.
చెన్నైలో జరిగిన ఈ వివాహానికి తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ హాజరవడం విచిత్రం కాదు. ఆయన వెనుక నటి త్రిష కూడా ఉన్నారు. ఈ ఫోటో వారి బంధం గురించి చెపుతుంది.
ఆయన పక్కనే జగన్, వారిద్దరి పక్కన గౌతం అదానీ కూడా ఉన్నారు. గౌతం అదానీ పక్కనే బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా ఉన్నారు.
గౌతం అదానీ వ్యాపారవేత్త. కనుక తన వ్యాపార ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఇలాంటి బంధాలు నిలుపుకోవడం సహజం.
కానీ ఆయనను, అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణపై విమర్శలు గుప్పించేవారు, ఇలాంటి సందర్భాల్లో ఆయనతో రాసుకుపూసుకు తిరుగడం వారి ద్వంద వైఖరికి నిదర్శనమే కదా?
ఇక జగన్, కేటీఆర్‌లది అన్నదమ్ముల అనుబంధమని అందరికీ తెలుసు. తాజాగా వారికి మరో సోదరుడు జోసఫ్ విజయ్ దొరికారు.
ఈ వేడుకలో ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా కౌగలించుకున్నారు. విజయ్, జగన్, కేటీఆర్ ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఫోటోలు, వీడియోలు షరా మామూలే.
ఈ ఫోటోలన్నీ వైసీపీ సొంత మీడియాలో అచ్చేసి ఈ రాజకీయ అన్నదమ్ముల అనుబందం ఎంత బలమైనదో వారి ప్రత్యర్ధులకు తెలియజేసింది. ఇలాంటి బంధాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చాలా ఉపయోగ పడతాయని వేరే చెప్పక్కర లేదు.





