ఒక నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, సంగీత దర్శకుడిగా, ఫైట్ మాస్టర్ గా, డైరెక్టర్ గా రాఘవ లారెన్స్ విలక్షణమైన ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ రంగాల్లో కాకుండా, తాజాగా మరో రంగంలో లారెన్స్ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఇటీవల జల్లికట్టు క్రీడ కోసం తమిళనాడు ప్రజలు పోరాటం జరిపి కేంద్రం ద్వారా ప్రత్యేక ఆర్డినెన్సు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఈ పోరాటంలో లారెన్స్ కూడా భాగస్వామి కాగా, ఈ ఆర్డినెన్స్ సాధించుకున్న నేపథ్యంలో సంతోషంతో 1100 కిలోల కేక్ కట్ చేసి ఎంజాయ్ చేయనున్నారు. ప్రముఖ చెఫ్ వినోద్‌తో పాటు స్నేహితుల సమక్షంలో అంబత్తూరు ప్రాంతంలోని ఎన్ స్టూడియోలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కేకును వినోద్ సహా మరో 40 మంది చెఫ్ లు 22 గంటలు పని చేసి తయారుచేశారు.
ఈ క్రమంలో ఈ భారీ కేక్ ఓ రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఇంతకు ముందు ఇటలీలో 1040 కిలోల కేకును తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఇప్పుడు లారెన్స్ తయారు చేయించిన ఈ కేకు బద్దలు కొట్టబోతోంది. 50 అడుగుల వెడల్పు, 5 అడుగుల పొడవున ఈ కేక్ ఉండనుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు లారెన్స్.


