ఆనాడు చంద్రబాబు నా ప్రాణాలను కాపాడకపోయుంటే….

Raghu Rama Krishna Raju Joins TDP Chandrababu Naidu

వైసీపి రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎట్టకేలకు టిడిపిలో చేరారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ప్రజాగళం సభలో ప్రజలందరి సమక్షంలో ఆయనకు చంద్రబాబు నాయుడు కండువా కప్పి టిడిపిలో చేర్చుకున్నారు.

ఈ సందర్భంగా రఘురామ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేనున్నాను… నేను విన్నాను అంటూ ఆనాడు జగన్‌ అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఆయనను నమ్ముకుంటే చివరికి నా పరిస్థితి ఏమయిందో మీకందరికీ తెలుసు. ఆనాడు జగన్‌ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు వెంటనే న్యాయవాదులను పంపించి నాకు ప్రాణహాని కలగకుండా అడ్డుకుని నా ప్రాణాలను కాపాడారు. లేకుంటే ఆరోజే నా కధ ముగిసిపోయేది. ఆ రోజు ఆయన నన్ను కాపాడబట్టే ఈరోజు నేను మీ అందరి ముందు ఇలా నిలబడగలిగాను.

ADVERTISEMENT

నేను నమ్ముకున్న జగన్‌ నాకు అపకారం తలపెడితే నాతో సంబంధమే లేని చంద్రబాబు నాయుడు నా ప్రాణాలను కాపాడారు. కొన్ని కారణాల వలన నేను నాలుగేళ్లుగా ఢిల్లీలో ఉండిపోవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు భరోసాతోనే నేను రాష్ట్రానికి తిరిగి వచ్చి నేడు టిడిపిలో చేరాను.

ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి గెలుపు ఖాయం. ఎవరెన్ని కుట్రలు చేసినా మా గెలుపుని అడ్డుకోలేరు. టిడిపి, జనసేన, బీజేపీల కూటమిని భారీ మెజార్టీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

రఘురామ కృష్ణరాజు కోసం చంద్రబాబు నాయుడు ఏలూరు ఎంపీ సీటుని బీజేపీకి ఇచ్చి నర్సాపురం ఎంపీ సీటుని తీసుకునేందుకు బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. కానీ వారు ఈ ప్రతిపాదనకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ అంగీకరించకపోతే, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత రఘురామ కృష్ణరాజుకి రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.

రఘురామ కృష్ణరాజుకి నర్సాపురం టికెట్‌ వచ్చినా రాకపోయినా టిడిపిలో చేరడం ఆయనకీ మంచిది. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆయన వలన టిడిపి, జనసేన, బీజేపీలకి కూడా చాలా మేలు కలుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories