రఘురామ కేసుకి అప్పుడే మూడు నెలల వయసు!

Raghu Rama Krishna Raju

గత పదేళ్ళుగా అక్రమాస్తుల కేసుల సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు విచారణ ముందుకు సాగనీయకుండా చేస్తున్నారు. కనుక ఈ కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైసీపి ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

దానిపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం, ఈ కేసుల విచారణ ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోందో వివరణ ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఉందో లేదో కూడా చెప్పాలని సీబీఐని ఆదేశించింది.

ADVERTISEMENT

ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొనబడిన ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి, ఇంకా ఈ కేసులతో సంబంధం ఉన్న పలువురిని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

వివేకా హత్య కేసు విచారణ 5 ఏళ్ళుగా సాగుతోంది. ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఇదే విషయం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు, 2024 జూలై నెలాఖరులోగా విచారణ ముగించాలని గడువు విధించింది. సీబీఐ దర్యాప్తు అధికారిని మార్పించింది. కేసు విచారణను హైదరాబాద్‌కు మార్చింది. కానీ నేటికీ ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.

కోడికత్తి కేసు కూడా కూడా విశాఖకు బదిలీ అయ్యింది. ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), కోర్టు తేల్చి చెప్పినా 5 ఏళ్ళుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. నిందితుడు శ్రీనివాస్ (దళిత యువకుడు) ‘రిమాండ్‌ ఖైదీ’గా 5ఏళ్ళుగా జైలులోనే మగ్గుతున్నాడు.

కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. ఆ కేసు విచారణ కూడా నింపాదిగా సాగుతూనే ఉంది. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ దాదాపు రెండేళ్ళుగా కొనసాగుతూనే ఉంది.

ఈ కేసులన్నీ అంతూ పొంతూ లేకుండా ఎందుకు సాగుతున్నాయో సుప్రీంకోర్టుకి తెలియదనుకోలేము. అలాగే ఈ కేసులన్నిటిలో డబ్బు, అధికారం, రాజకీయ పలుకుబడి ఉన్నవారందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని, పేదరికం కారణంగా నిందితులు, బాధితులకు న్యాయం జరగడం లేదని కూడా తెలుస్తూనే ఉంది.

కనుక రఘురామ వేసిన ఈ కొత్త పిటిషన్‌, దానిపై విచారణ కూడా ఇదే విదంగా సాగవచ్చు. ఈ కేసు తదుపరి విచారణ జనవరికి వాయిదా వేయడంతోనే ఈ కేసుకి కూడా అప్పుడే మూడు నెలల వయసు వచ్చేసింది కదా?అది కూడా మరో మూడేళ్ళు సాగితే ఆశ్చర్యం ఏముంటుంది?

ADVERTISEMENT
Latest Stories