రాహుల్‌ మంత్రివర్గం.. రేవంత్ చాలా దూరం వెళ్ళిపోయారే!

Revanth Reddy on Rahul Gandhi Cabinet

కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌ గాంధీ భజన, బిజేపిలో మోడీ భజన, అలాగే ప్రాంతీయ పార్టీలలో వినిపించే అధినేతల భజనలకు జనాలు అలవాటు పడిపోయారు. కానీ రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేస్తామనే కాంగ్రెస్‌ నేతల భజనే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

ఇతర రాష్ట్రాలలోల కాంగ్రెస్‌ నేతల సంగతేమో కానీ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మాత్రం తరచూ ఇదే నొక్కి చెపుతున్నారు. సరే! భక్తి పారవశ్యమో మరో కారణంతోనో ఆయన గట్టిగా ఈ భజన చేస్తున్నారని సరిపెట్టుకోవచ్చు.

ADVERTISEMENT

కానీ ‘ఆలూలేదు చూలు లేదు కొడుకు పేరు..’ అన్నట్లు రాహుల్‌ గాంధీ ఏవిధంగా ప్రధానమంత్రి కాగలరో తెలీదు కానీ అయన మంత్రివర్గంలో మంత్రులను కూడా సిఎం రేవంత్ రెడ్డే ఖరారు చేసేస్తున్నారు.

హైదరాబాద్‌లో నిన్న జరిగిన ఓ సభలో మాట్లాడుతూ, “కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో యువశక్తి అంటే ఏమిటో మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు అర్ధమయ్యే ఉంటుంది. యువత గట్టిగా తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. వారి గళం రోడ్లపై కాదు… పార్లమెంటులో కూడా వినిపించాలి.

కనుక ప్రజా ప్రతినిధులుగా పోటీ చేసేందుకు వయో పరిమితిని 21 ఏళ్ళకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాను. త్వరలో శాసనసభలో కూడా దీని కోసం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాము.

అంతేకాదు.. రాహుల్‌ గాంధీ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా జెన్-జీని చేస్తా. ఈ బాధ్యత నేను తీసుకుంటాను. అవసరమైతే నేను స్వయంగా ఇండియా కూటమిలో మిత్ర పక్షాలతో మాట్లాడి ఒప్పిస్తాను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి మిత్ర పక్షాల మద్దతు ఉన్నా గత 15 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయింది. వచ్చే ఎన్నికలలో వస్తుందో లేదో కూడా తెలీదు.

ప్రధాని పదవి ఎవరికి?అనే ఒకే ఒక్క కారణంగా దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యపడటం లేదు. కానీ ఇండియా కూటమిలో మిత్ర పక్షాల అభిప్రాయం, అనుమతి లేకుండానే ‘రాహుల్‌ గాంధీ ప్రధాని’ అని కాంగ్రెస్‌ నేతలు ముందే చెప్పేసుకుంటున్నారు.

మిత్ర పక్షాలు రాహుల్‌ గాంధీని ప్రధానిగా అంగీకరిస్తాయో లేదో తెలీదు కానీ అప్పుడే అయన మంత్రివర్గం కూర్పు గురించి కూడా ఇలా మాట్లాడేస్తున్నారు. ఇలాంటి మాటలు, ఊహలు చాలా సంతోషం కలిగించవచ్చు.

కానీ ముందే చెప్పుకున్నట్లు ఆ భక్తి పారవశ్యంలో ఈవిధంగా మాట్లాడేస్తుంటే, ఎన్నికలకు ముందే ఇండియా కూటమి కూడా విచ్చినమయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఎక్కువ నష్టపోయేది కాంగ్రెస్‌ పార్టీ… రాహుల్‌ గాంధీయే అని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories