శుక్రవారం సాయంత్రం ఉన్నట్లుండి మారిపోయిన వాతావరణం ‘విశ్వనగరం’లో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. పెద్ద పెద్ద హోర్డింగ్ లు కూడా తాటాకుల మాదిరి ఎగిరిపడిపోవడం వంటి సంఘటనలకు వేదిక అయిన ఈ బీభత్సం, ఒక తెలుగు హీరోను కూడా తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. ‘అందాల రాక్షసి, అలా ఎలా, శ్రీమంతుడు’ చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో రాహుల్ ను తీవ్ర గాయాల పాలు చేసింది ఈ బీభత్సం.
తన సోదరుడు రోహిత్ రూంలో ఉన్న రాహుల్ ను ఈదురు గాలులు గాయపడేలా చేసాయి. ఇంటి కిటికీ అద్దాలు విరిగిపడి, ఎగురుతూ ఉన్న గాజు పెంకు వచ్చి మోకాలి క్రింద భాగాన్ని కోసేసిందని… రాహుల్ ట్విట్టర్ లో తెలిపారు. అంతే కాదు, ఆ రూమ్ నిండా గాజు పెంకులు మరియు నీటితో నిండిపోయిందని, అందుకే హోటల్ రూమ్ కు మారాల్సి వచ్చిందని కూడా తెలిపారు రాహుల్. సహజంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాలలో చాలా చూస్తూ ఉంటాం. కానీ, మన సినీ హీరోకు రియల్ లైఫ్ లో కూడా అలాంటి అనుభవమే ఎదురు కావడం విశేషం.
నిజానికి హైదరాబాద్ లోని పరిస్థితులు చూసిన ప్రతి ఒక్కరికి ఒక రకమైన భయానకమైన ఒత్తిడికి గురయ్యారు. వెన్నెల కిషోర్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ పరిస్థితులను చూసి బెంబేలెత్తిపోయారు. అంతేకాదు, మరికొందరైతే ఇళ్ళు వదిలి బయటకు రావద్దని సూచనలు చేసారు. ప్రకృతి ధాటికి ఎంతటి విశ్వనగరమైనా తలవంచక తప్పదని మరోసారి రుజువైంది.



