క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు సుపరిచితం అయిన రాజారవీంద్ర, ఇండస్ట్రీ వర్గాలకు మాత్రం మరో విధంగా సుపరిచితం. ఒకప్పుడు చిరంజీవికి అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజారవీంద్ర, ఆ తర్వాత మరికొందరు ప్రముఖ హీరోల వద్ద మేనేజర్ గా పనిచేసిన విషయం సినీ జనాలకు తెలిసిందే. అంత సన్నిహితంగా ఉండే రాజారవీంద్రకు – హీరో రవితేజ మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఇటీవల హల్చల్ చేసిన టాక్ పై రవీంద్ర పెదవి విప్పారు.
“చాలా మంది అనుకుంటున్నట్టు తనకు, హీరో రవితేజకు మధ్య ఎలాంటి ఆర్థిక విభేదాలు లేవని, నిజానికి ఒకప్పుడు రవితేజతో తనకు చాలా సాన్నిహిత్యం ఉండేదని… అతని కాళ్లు కడిగి తానే పెళ్లి చేశానని” గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత మేనేజర్ గా అతని డేట్స్ కూడా తానే చూశానని తెలిపాడు. అయితే ఒకప్పుడు రవితేజను తాను ‘ఏరా’ అని పిలిచేవాడినని… పెద్ద హీరో అయిన తర్వాత ఆ పిలుపు అతనికి నచ్చి ఉండకపోవచ్చని… అందుకే తనను దూరం పెట్టి ఉండవచ్చని చెప్పాడు.
తన వ్యవహారాలను తానే చూసుకోగలనని చెప్పి… తనను రవితేజ దూరం పెట్టాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజా రవీంద్ర వెల్లడించాడు. ప్రస్తుతం జయసుధ, రాజ్ తరుణ్, విష్ణు, నిఖిల్, సునీల్ ల డేట్స్ చూసుకుంటున్నానని తెలిపాడు. ఒకప్పుడు తెరచాటున దాగిపోయే ఈ విషయాలన్నీ, వెబ్ మీడియా పుణ్యమా అంటూ ఇంటర్వ్యూలు హల్చల్ చేస్తుండడంతో, తెరవెనుక జరిగిన ప్రతి కధ వెలుగులోకి వస్తున్నాయి.



