ఇన్ని రోజులు స్టార్ హీరో స్థాయిలో వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు చిన్న సినిమాతో వచ్చాడు. బిల్డప్ కాకుండా కథ ఎక్కువగా ఉండేలా చూసుకుని రాక్షసుడు సినిమా చేసాడు. ఈ చిత్రానికి ఇప్పుడు మంచి టాక్ వచ్చింది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళనాట హిట్ అయిన రాచ్చసన్ సినిమాకు రీమేక్. టాక్ బావుండడంతో రెండవ రోజు కలెక్షన్స్ మొదటి రోజు కలెక్షన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. ఈరోజు ఆదివారం చాలా చోట్ల థియేటర్లు యాడ్ చేస్తున్నారు.
ఇంత జరిగినా సినిమా బ్రేక్ ఈవెన్ అనుమానమే అని తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రోజులకు గాను కేవలం మూడు కోట్ల షేర్ రాబట్టింది. అయితే సినిమా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 13.5 కోట్ల బిజినెస్ చేసింది. వర్కింగ్ డేస్ మొదలయ్యాక ఎంత మంచి టాక్ ఉన్నా అంతంత మాత్రమే. దీనికి తోడు వచ్చే వారం మూడు ఇంట్రస్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘మన్మథుడు 2’, భారీ పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’తో పాటు అనసూయ లీడ్ రోల్‌లో నటించిన ‘కథనం’ చిత్రాలు విడుదల కానున్నాయి.
పక్క రాష్ట్రాలలోనూ అదే పరిస్థితి. అమెరికాలో అయితే సినిమాని రివ్యూలు కూడా కాపాడలేకపోయాయి. వారాంతంలో కూడా పెద్దగా సినిమాను చూసే వారు లేరు. దీనితో టాక్ బాగా వచ్చినా సినిమా హిట్ అయ్యే పరిస్థితి లేదు అన్నట్టుగా ఉంది. మరోవైపు సినిమాకు ప్రమోషన్స్ పెంచాలని చిత్రబృందం భావిస్తోంది. మరి అది ఎంతవరకూ సినిమాకు ఉపయోగపడుతుందో చూడాలి.



