గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర రావు (ఏబీవీ), 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం వేధింపులు ఎదుర్కొన్నాక టీడీపిలో చేరాలనుకున్నారు.
తనను టీడీపిలో చేర్చుకొని ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే, భవిష్యత్‌లో మళ్ళీ వైసీపీ వంటి అరాచక శక్తిని తలెత్తకుండా ఉక్కుపాదంతో అణచివేస్తానని చంద్రబాబు నాయుడుకు చెప్పారు. కానీ ఎందువల్లో ఆయన తనను పట్టించుకోలేదని ఏబీవీ స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతుతో విజయవాడ మేయర్ పదవికి ఏబీవీ పోటీ చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విజయవాడ నగరంలో పేరుకుపోయిన సమస్యలు ప్రస్తావిస్తున్నారు. ఈసారి ప్రత్యక్ష పద్దతిలో ప్రజలు మేయర్‌ని ఎన్నుకోబోతున్నారు. కనుక ఇలాంటి అంశాలు ప్రస్తావించడం సహజమే.
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఈ సమస్యలు పరిష్కరించనందుకు ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా సహేతుకమే.
కానీ ఇదివరకు టీడీపిలో చేరాలనుకున్న అయన ఇప్పుడు ‘నేను మేయర్ అయితే..’ విజయవాడలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తానంటూనే, టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటం గమనార్హం.
కనుక అయన విజయవాడ నగర సమస్యల పరిష్కారం కోసమే బరిలో దిగారా?ఈ ఎన్నికలలో గెలిచి నిజంగానే మేయర్ పదవి చేపట్టాలనుకుంటున్నారా లేక కూటమి పార్టీల ఓట్లు చీల్చి వైసీపీని గెలిపించేందుకు బరిలో దిగారా? అనే సందేహం కలుగుతుంది.
ఒకవేళ ఆయనకు అటువంటి దురాలోచనలు లేకపోయినా మేయర్‌గా ఎన్నికైతే, రాష్ట్ర ప్రభుత్వం, కౌన్సిలర్ల సహాయ సహకారాలు లేకుండా విజయవాడ సమస్యలు ఏవిధంగా పరిష్కరించగలరో ఆయనే చెపితే బాగుంటుంది.





