సినీ వినీలాకాశంలో నందమూరి తారక రామారావు పోషించని పాత్ర లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సామాన్యుడి దగ్గర నుండి దేవుడు వరకు అన్ని పాత్రలను అవలీలగా పోషించిన ఎన్టీఆర్ అనే పేరు కమర్షియల్ కు కేరాఫ్ అడ్రస్ లాంటిది. అలాంటి ఎన్టీఆర్ ను డ్యూయల్ రోల్ లో పెట్టి డా.డి.రామానాయుడు తన తొలి సినిమాగా “రాముడు – భీముడు” అనే సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.
1964 మే 21వ తేదీన విడుదలైన ఈ సినిమా నిర్మాతగా రామానాయుడు గ్రాఫ్ ను మార్చివేసింది. మరోసారి వెనక్కి తిరిగి చూసుకోనివ్వుకుండా చేసిన ఈ సినిమాను మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ లో నిర్మాణం అయిన ఈ సినిమాను, ప్రస్తుతం కలర్ లో డిజిటలైజ్ చేసి మళ్ళీ విడుదల చేయనున్నామని సురేష్ బాబు తెలిపారు.
రామానాయుడు వారసుడిగా నిర్మాతగా సురేష్ బాబు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో చిత్ర నిర్మాణాలకు దూరంగా ఉంటున్న ‘సురేష్ ప్రొడక్షన్స్’లో చివరి సినిమాగా ‘రాముడు భీముడు’ అవుతుందేమో చూడాలి. ఇదే జరిగితే ఏ సినిమాతో అయితే సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభమైందో, మళ్ళీ అదే సినిమాతో ఆ బ్యానర్ ముగియడం విశేషంగా చెప్పుకోదగినది.



