బాలీవుడ్ తన మ్యాజికల్ టచ్ కోల్పోయింది అని అందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో.. బాలీవుడ్ కి మళ్లీ ఊపిరి పోయడమే కాకుండా, ఇలాంటి సినిమాలు సిన్సియర్ గా తీస్తే జనాలు చూస్తారు అని నమ్మకం కలిగించిన చిత్రం “దురంధర్”. ఆ సినిమాతో దర్శకుడు ఆదిత్య ధర్ కు ఎంత మంచి పేరొచ్చిందో.. నటుడు రణవీర్ సింగ్ కు కూడా అదేస్థాయిలో పేరొచ్చింది. అలాంటి నటుడ్ని ఇప్పుడు బాలీవుడ్ మూడేళ్లు బ్యాన్ చేయడం అనేది చర్చనీయాంశంగా మాత్రమే కాక హాస్యాస్పదంగానూ మారింది.
డాన్ 3 సినిమా నుంచి రణవీర్ సింగ్ తప్పుకోవడం వల్ల దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కు నష్టం వాటిల్లిందని, రణవీర్ సింగ్ కనీసం రెస్పాండ్ కూడా అవ్వలేదని, అందువల్లే రణవీర్ ను మూడేళ్ల పాటు బాలీవుడ్ నుండి బ్యాన్ చేస్తున్నట్లు FWICE ప్రకటించింది. ఇదే సందర్భంలో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ లు మరియు టెక్నీషియన్స్ రణవీర్ సినిమాలకు దూరంగా ఉండాలని కూడా తీర్మానించింది. రణవీర్ సింగ్ మీద బాలీవుడ్ ఫెడరేషన్ సీరియస్ అవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు.. గతంలోనూ కొన్ని సినిమాలకు తీసుకున్న అడ్వాన్సులు వెనక్కి ఇవ్వలలేదని రణవీర్ కు మొట్టికాయలు వేసిన సందర్భాలు ఉన్నాయి.
అయితే.. దురంధర్ లాంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రణవీర్ ను బ్యాన్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఇన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న ఫర్హాన్ అక్తర్ ఇప్పుడెందుకు ఫైర్ అయ్యాడు. 45 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ ఎందుకు? నిజంగానే ఫర్హాన్ అంత మొత్తాన్ని ప్రీప్రొడక్షన్ కూడా ఖర్చు చేశాడా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రణవీర్ సింగ్ మాత్రం ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వకపోవడం గమనార్హం. రణవీర్ ఇప్పుడు చేయబోయే నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్, ఎలాంటి సినిమా చేసినా దానికి వందల కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రావడం కూడా పక్కా. అలాంటప్పుడు ఆ స్టార్ డం ను క్యాష్ చేసుకోకుండా అసలే చాలా వీక్ గా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ మీద ఎఫెక్ట్ చూపించేలా ఎఫెక్ట్ పడేలా రణవీర్ సింగ్ ను ఏకంగా 3 ఏళ్లు బ్యాన్ చేసి బాలీవుడ్ ఏం సాధిస్తుందో చూడాలి.
రణవీర్ సింగ్ ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతాడు? రెస్పాండ్ అయినా లీగల్ గా మూవ్ అవుతాడా లేక 45 కోట్ల రూపాయలు చెల్లించి ఇష్యూని సెటిల్ చేసుకుంటాడా? లేక “డాన్ 3”లో యాక్ట్ చేసి తన ఇమేజ్ ను మరింత పెంచుకుంటాడా? అనేది చూడాలి.




