ఒకపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని వరదప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటే… మరోపక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పథకాలపై ప్రసంగించిన రాపాక.. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.
ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని ప్రజా సంక్షేమ నిర్ణయాలను చిన్న వయసులోనే అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్మరణీమైన స్థానం దక్కించుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రజల శ్రేయస్సు గురించి ఇంతగా పరితపించే సీఎంను తానెప్పుడూ చూడలేదని, తాను బ్రతికున్నంత వరకు వైఎస్ జగనే ముఖ్యమంత్రి అన్నారు.
సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారని పేర్కొన్నారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది వాలంటీర్లను నియమించడం ప్రశంసనీయమని కొనియాడారు. గతంలో ఇళ్ల స్థలాల కోసం ఎమ్మెల్యేల వద్ద ప్రజలు బారులు తీరేవారని అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని, ఎవరైనా వచ్చినా సచివాలయాలకు పంపడమే తమ పని చెప్పుకొచ్చారు.
దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణ యుగంలా ఉండేదని, వైఎస్ జగన్ అదే దారిలో నడుస్తున్నారని వర్ణించారు. రాపాక వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ పార్టీకి చెందిన ఒక్కగానొక్కక ఎమ్మెల్యే కూడా ఈ విధంగా ప్రవర్తించడం జనసైనికులకు మింగుడుపడటం లేదు.





