కార్పొరేట్ కల్చర్ లో సేవాభావాలను కనపరిచిన ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ శ్రీ రతన్ టాటా బుధవారం రాత్రి 11 .30 నిముషాలకు అనారోగ్య కారాణాలతో ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల అటు రాజకీయ ప్రముఖులు ఇటు ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థలు తమ సంతాపాన్ని తెలియచేశాయి.
టాటా అనేది ఒక సామాన్యుడి బ్రాండ్ గా, మధ్యతరగతి అవసరంగా మార్చి చూపించిన ఘనుడు రతన్ టాటా. రతన్ టాటా జీవితాన్ని, ఆయన సాధించిన విజయ శిఖరాలను నేటి యువతకు ఒక పాఠంలా చెప్పవచ్చు. అలాగే రాబోయే కొత్త తరం వ్యాపార వేత్తలకు ఆయన వ్యాపార శైలిని ఒక నిఘంటువుగా చూపించవచ్చు.
వ్యాపారం అంటే ప్రతి సారి అన్ని కోణాలలో లాభాపేక్షే అంతిమ లక్ష్యం కాకూడదు అంటూ కొన్ని సార్లు వినియోగదారుని శ్రేయస్సుని, వారి ఆర్థిక స్థితి గతులను కూడా పరిగణలోకి తీసుకుని ఉత్పత్తులను సృష్టించాలి అనే భావనలో రతన్ టాటా వ్యాపారాన్ని కొనసాగించే వారు.
అందులో భాగమే లక్ష రూపాయలకు కారు అంటూ అతి సామాన్యుడి సొంత కారు కలను ‘నానో’ రూపంలో తీర్చిన గొప్ప మనసున్న వ్యాపార వేత్త రతన్ టాటా. కార్పొరేట్ కల్చర్ లో రతన్ టాటా పేరు ఎప్పటికి చెరిగి పోలేనిది ఎవ్వరు అందుకోలేనిది.
టాటా గ్రూప్స్ నుండి తయారయ్యే ఉత్పత్తులు వినియోగదారుని తృప్తినే ఎక్కువగా పరిగణలోకి తీసుకునేది. టాటా గ్రూప్స్ పోటీగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు పారిశ్రామిక రంగంలో పుట్టగొడుగుల మాదిరి తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నా రతన్ టాటా ఎప్పుడు తానూ నియమించుకున్న విలువలకు కట్టుబడే వ్యాపారాన్ని కొనసాగించారు.
అలాగే టాటా గ్రూప్స్ చైర్మన్ గానే కాకుండా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టి గొప్ప మానవతా వాదిగా కూడా దేశ ప్రజల మనస్సులలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కరోనా వంటి మహమ్మారి దేశాన్ని చుట్టుముట్టిన సమయంలో కూడా రతన్ టాటా తన విశాలమైన మనస్సును చాటుకుంటూ దేశ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సుమారు 1500 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.
అలాగే తన వ్యాపార సంస్థలలో పని చేసే ఉద్యోగులను సైతం తన కుటుంబ సభ్యులుగా భావించే దాతృత్వం రతన్ టాటా సొంతం. అంతటి మహా మానవతావాది నిన్న రాత్రి పరమపదించారు. ఆయన మృతి టాటా గ్రూప్స్ సంస్థలకే కాదు దేశ పారిశ్రామిక రంగానికి ఒక తీరని లోటనే చెప్పాలి.
బ్రతికి ఉన్నన్నాళ్ళు తానూ నమ్ముకున్న విలువలకు కట్టుబడి వ్యాపారాలు చేసి అంచలంచలుగా ఎదుగుతూ దేశ పారిశ్రామిక రంగాన్ని ప్రభావిత చేసే స్థాయికి ఎదిగి ఒదిగారు రతన్ టాటా. టాటా స్టీల్, టాటా మోటర్స్, టాటా కంజ్యూమర్స్, టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ, టాటా కమ్యూనికేషన్స్ అంటూ పలు సంస్థలను సృష్టించి టాటా గ్రూప్స్ పేరిట అటు దేశీయ స్టాక్ మార్కెట్లలో కూడా తన బలమైన ముద్ర వేశారు రతన్ టాటా.
ఆయన మృతి పట్ల M9 కూడా అశృనివాళి తో కూడిన శ్రద్ధాంజలి ఘటిస్తూ టాటా గ్రూప్స్ కుటుంబానికి సంతాపం తమ తెలియచేస్తుంది. WE ALL MISS YOU SIR ….




