వచ్చే శాసనసభ ఎన్నికలలో ఏపీలో 175 స్థానాలకు పోటీ చేయాలని బిఆర్ఎస్ నిర్ణయించుకొన్నట్లు తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రకటించేశారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తిరుమల శ్రీవారి సాక్షిగా హామీ ఇచ్చేశారు. ఇదివరకు నరేంద్రమోడీ కూడా తిరుమల శ్రీవారి సాక్షిగానే ఏపీకి ప్రత్యేకహోదా, రాజధాని అమరావతిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ రెండూ ఏమయ్యాయో అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన సంగతి మరిచిపోయి మల్లారెడ్డి హామీ ఇచ్చేశారు.
ఇక ఏపీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరిలా అయిపోయిందని అందుకే కేసీఆర్‌ని కూడా తీసుకువస్తున్నామని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. అంటే ఇప్పటికే ఉన్న పార్టీలు సరిపోవన్నట్లు మరో పార్టీని తెస్తే ఆ విస్తరి ఇంకా చిరుగుతుందే తప్ప అతకదు కదా?ఏపీలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సచివాలయం నిర్మిస్తామని రావెల కిషోర్ బాబు చెపుతున్నారు.
అయితే గత ఏపీ శాసనసభ ఎన్నికలలో రాజకీయంగా పావులు కదిపి ప్రభుత్వాన్ని మార్చి రాజధాని ఏర్పడకుండా చేసిందెవరు?అనే ప్రశ్నకు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రావెల కిషోర్ బాబుకే బాగా తెలుసు. కనుక ఏపీని ఉద్దరించడానికి ఎవరినో తీసుకురావలసిన అవసరమే లేదు. ఉన్నపార్టీలలో దేనికి అమరావతి, పోలవరం పూర్తిచేయాలనే ఆలోచనలు ఉన్నాయో దానిని గెలిపించుకొంటే చాలు కదా?
అయినా ఏపీ పొడకిట్టని కేసీఆర్‌ని రావెల కిషోర్ బాబు వంటి నేతలు నెత్తిన మోసుకు రాష్ట్రానికి తీసుకురావడం దేనికి?ఏపీని ఉద్దరించమని కేసీఆర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలడం దేనికి?ఒకవేళ వారికి కేసీఆర్ నాయకత్వం మీద అంత నమ్మకం, బిఆర్ఎస్‌లో చేరాలని అంతగా ఆసక్తిగా ఉన్నట్లయితే వారు తెలంగాణలోనే ఆ పార్టీ తరపున టికెట్ తీసుకొని పోటీ చేయొచ్చు కదా?అందుకు తెలంగాణలో బిఆర్ఎస్ నేతలు ఒప్పుకొంటారా?ఒకవేళ ఒప్పుకోరనుకొంటే మరి బిఆర్ఎస్ ఏపీలో ఎలా పోటీ చేయవచ్చనుకొంటోంది?అనే ఆలోచన రావెల కిషోర్ బాబు వంటి నేతలకి కలగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనుక ఏపీలో నేతలు తమ స్వార్ధ రాజకీయాల కోసం మరో కొత్త సమస్యను ఏపీ ప్రజల నెత్తిన పెట్టాలని చూస్తే వారికి కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పట్టవచ్చునని గ్రహిస్తే మంచిది.



