కేరళలోని కొల్లాం, పుట్టింగల్ దేవి ఆలయంలో బాణసంచా పేలి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 100కు పైగా చేరింది. అలాగే మరో 500 మందికి పైనే క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనపై స్పందించిన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమన్ చాందీ, జరిగిన ప్రమాదం తనను కలచి వేసిందని అన్నారు. అన్ని అధికారిక కార్యక్రమాలనూ రద్దు చేసుకుని కొల్లాం చేరుకుని దగ్గరుండి సహాయక చర్యలలో పాల్గొన్నారు.
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన బయలుదేరి కేరళ చేరుకున్నారు. తనకు భద్రత, ప్రొటోకాల్ పేరిట అధికారులు ఎవరూ ఎలాంటి హడావుడి పడవద్దని ఆయన సూచించారు. ఎయిర్ ఫోర్స్, వాయుసేన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. తాను బాధితులకు అండగా ఉంటామన్న భరోసాను ఇచ్చేందుకు మాత్రమే కేరళకు వస్తున్నానని, ఎలాంటి స్వాగతాలు ఏర్పాటు చేయవద్దని అన్నారు.
ఇదిలా ఉంటే, ఈ సంఘటన బాణసంచా పేలుళ్ల కారణంగా జరిగిందని విచారణలో తేలగా, మరో అవాక్కయ్యే విషయం వెలుగు చూసింది. పేలిన బాణాసంచా కంటే ఇంకా దేవాలయంలో నిల్వ ఉన్న బాణసంచా చాలా ఎక్కువ అని, వాటికి కూడా ఫైర్ జరిగి ఉంటే, జరిగే ప్రమాదం ఊహలకందేది కాదని, అదో జరిగినట్లయితే మృతుల సంఖ్య ఇంతకు పదింతలు జరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేసారు.
ఈ ఆలయంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా పోటాపోటీగా బాణసంచాను కాలుస్తారని తెలుస్తోంది. దాదాపు 15 వేల మంది ఈ వేడుకలను తిలకించేందుకు గుడి సమీపానికి చేరుకున్న వేళ, నిప్పురవ్వలు బాణసంచాపై పడి భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహా విషాదం వెనుక ఆలయ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఈ మేరకు బోర్డు అధికారులపై కేసు పెట్టామని పోలీసులు తెలిపారు.





