కల్కి ఎడి2898లో ‘బౌంటీ హంటర్’ భైరవ్‌గా ప్రభాస్ జోకర్‌లా ఉన్నాడంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది.
అర్షద్ వార్సీ ఆవిదంగా అనడానికి బలమైన కారణమే ఉంది. మన భారతీయ సినీ పరిశ్రమలో దశాబ్ధాలుగా హీరో అంటే ఇలాగే ఉండాలనే కొలతలు పెట్టేశారు. అలాగే హీరోకి ఎలివేషన్స్ తప్పనిసరి చేసేశారు. కనుక అవి చూస్తూ పెరిగిన అర్షద్ వార్సీ లేదా మరొకరు ప్రభాస్‌ని ఆ విదంగా చిలిపిగా చూపిస్తూ హీరో అనుకోమంటే జీర్ణించుకోలేకపోవచ్చు. అందుకే అర్షద్ వార్సీ ఆవిదంగా అని ఉండవచ్చు.
కానీ ఇంతవరకు ఎవరూ చూడని కోణంలో ప్రభాస్‌ని దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపారనే విషయం గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే… హాలీవుడ్ సినిమాలలో హీరోలని అలా పరిచయం చేసి, కధ నడిపిస్తే జనాలు ఎగబడి చూస్తారు. వేలకోట్లు కలక్షన్స్ వస్తాయి. కల్కిలో నాగ్ అశ్విన్ కూడా అటువంటి ప్రయోగమే చేశారని చెప్పవచ్చు.
ప్రభాస్ స్థాయి హీరోకి అటువంటి మ్యానరిజంతో పాత్రని డిజైన్ చేయవచ్చనే ఆలోచనే గొప్పగా ఉంది. ప్రభాస్ కూడా దానిని తెరపై అంతే చక్కగా పండించారు కూడా. ప్రభాస్‌ని ఆవిదంగా చూసి చాలా కాలమే అవుతోంది. కనుక అభిమానులు ఆ మ్యానరిజం చూసి మురిసిపోతున్నారు.
కల్కిలో మిగిలినవారిని పక్కన పెడితే అమితాబ్ బచ్చన్ పాత్ర మొదటి నుంచి చివరి వరకు గంభీరంగానే ఉంటుంది. అలాగే కమల్ హాసన్ కళ్ళలో చూచాయగా విషాదం కనిపిస్తుంటుంది. వాటినీ అభిమానులు ఆస్వాదించారు.
ఇంత పెద్ద సినిమాలో రాంగోపాల్ వర్మ, రాజమౌళి వంటివారిని కూడా పెట్టి అందరినీ మెప్పించగలగడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ప్రభాస్-రాజమౌళి మద్య పెట్టిన ఆ డైలాగ్స్ చూసి అందరూ హాయిగా నవ్వుకోకుండా ఉండలేరు.
అసలు మహాభారతంలో అశ్వధామని తెచ్చి కలియుగంతో కనెక్ట్ చేయడమే ఓ గొప్ప ఆలోచన. మహాభారతం అన్నప్పుడు శ్రీకృష్ణుడు తప్పనిసరి. కానీ కల్కిలో ఎక్కడా శ్రీకృష్ణుడు మొహం చూపకుండానే స్టోరీ నడిపించేశారు నాగ్ అశ్విన్.
బహుశః రెండో భాగం కోసం దాచిపెట్టి ఉంచి ఉండొచ్చు. కానీ శ్రీకృష్ణుడు మొహం చూపకుండా ఆయనతో డైలాగ్స్ చెప్పిస్తూ సినిమా లాగించేయడం గొప్ప విషయమే కదా?
మహాభారతం… హీరో అనుకోగానే ఎవరైనా హీరోని అర్జునుడిగానే ఊహించుకుంటారు. కానీ నాగ్ అశ్విన్ ప్రభాస్‌ని కర్ణుడుగా చూపించి అందరికీ షాక్ ఇచ్చారు. అలా ఎందుకు చూపారో రెండో భాగంలో తెలుస్తుంది. సినిమా చివరిలో ‘కాస్త ఆలస్యంగా వచ్చానా ఆచార్య?’ అంటూ ప్రభాస్‌ని చూపిన తీరు మహాద్భుతం.
ఇంత గొప్పగా ఉన్న పాత్రలని వాటి లోతుని ఆస్వాదించకుండా ప్రభాస్‌ని జోకర్ అని అనేయడం ఏం బాగుంది? అసలు రెండో భాగంలో కూడా ప్రభాస్‌ని ఇలాగే చూపితే బాగుంటుంది కానీ చాలా యుద్ధాలు చేయాల్సి ఉంటుంది కనుక సాధ్యపడకపోవచ్చు. కనుక రెండో భాగంలో చిలిపి ప్రభాస్‌ని మిస్ కాబోతున్నాము.




