జియో దెబ్బ… టెలికాం ఆపరేటర్ల “ఆఫర్ల” వర్షం!

Reliance Jio Offers‘జియో’ ఎంట్రీతో టెలికాం ఆపరేటర్లలో పోటీతత్వం పెరిగింది. దీంతో ఇతర టెలికాం ఆపరేటర్లు కూడా ధరలు తగ్గిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘జియో’ ప్రకటించిన ఉచిత కాల్స్ ఆఫర్ మార్చి నెలాఖరుతో ముగియనుండడంతో టెలికాం ఆపరేటర్లంతా జియోకు ధీటైన ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు.

ప్రధానంగా రిలయన్స్, ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు ప్రకటించిన అన్ లిమిటెడ్ రీ ఛార్జ్ ప్లాన్ లు వినియోగదారులను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ఈ ప్లాన్ లో కాల్స్ అన్ లిమిటెడ్ ఉండడంతో పాటు డేటా ప్యాక్ ను కూడా 28 రోజుల కాలపరిమితితో అందజేయడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రకటించిన ఈ ఆఫర్ల జాబితాలన్నీ వినియోగదారుల కోసం…

ADVERTISEMENT

రిలయన్స్ జియో… 99 రూపాయలు చెల్లించి ప్రైమ్ లో రిజిస్టరైన వినియోగదారులు 303 రూపాయలతో రీ ఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 28 జీబీ 4జీ డేటాను కూడా పొందుతారు. అదే జియో ప్రైమ్ పోస్ట్ పెయిడ్ యూజర్లకైతే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 30 జీబీ 4జీ డేటాను అందించనున్నారు. ప్రీపెయిడ్ యూజర్లు 499 రూపాయలతో జియో ప్రైమ్ రీ ఛార్జ్ ప్యాక్ ను వేసుకుంటే 56 జీబీ 4జీ డేటాను అందిస్తామని రిలయన్స్ తెలిపింది. ఇందులో రోజూ 2జీబీ 4జీ డేటాను వినియోగించుకోవచ్చు. ఇదే పోస్టు పెయిడ్ వినియోగదారులైతే 60జీబీ 4జీ డేటాను పొందవచ్చు.

ఎయిర్ టెల్… ప్రీపెయిడ్ వినియోగదారులు 345 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 28 జీబీ హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటాను వాడుకోవచ్చు. రోజూ 1జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు. అయితే ఇందులో పగలంతా 500 ఎంబీ వినియోగించుకోవాల్సి ఉండగా, అర్థరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు మిగిలిన 500 ఎంబీని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా రోజులో ఏ టైమైనా 1 జీబీ డేటా వాడుకోవాలనుకుంటే మాత్రం 549 రూపాయలతో రీ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అన్ లిమిటెడ్ కాల్స్ లో కూడా 1200 (20 గంటలు) నిమిషాల వరకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. అవి దాటితే నిమిషానికి 30 పైసలు ఛార్జ్ చేస్తారు.

వొడాఫోన్… 346 రూపాయలతో ప్రీపెయిడ్ వినియోగదారులు రీఛార్జ్ చేసుకుంటే ఉచిత అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 28 జీబీ డేటాను వొడాఫోన్ అందజేయనుంది. ఈ ప్యాక్ లోని వినియోగదారులు రోజూ 1 జీబీ డేటా వినియోగించుకోవచ్చని వొడా ఫోన్ తెలిపింది. ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు 348 రూపాయల రీ ఛార్జ్ తో అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 14 జీబీ ఉచిత డేటాను అందించనుంది. ఇందులో భాగంగా ప్రతి రోజూ 500 ఎంబీ డేటాను వినియోగించుకోవచ్చని ఐడియా ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ ఆపర్ కేవలం 4జీ హ్యాండ్ సెట్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో వుండడం గమనార్హం.

ADVERTISEMENT
Latest Stories