Shehzada Movieరీమేక్ చేయడం ఒక కళని పెద్దలు ఊరికే అనలేదు. ఒకప్పుడంటే ఇంకో భాషలో హిట్ అయిన సినిమాని చూసే అవకాశం ఉండేది కాదు కాబట్టి పెదరాయుడు, చంటి, ఘరానా మొగుడు లాంటివి ఇండస్ట్రీ రికార్డులు సృష్టించాయి కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. చివరిగా అంత గొప్ప విజయం అందుకున్నది ఒక్క గబ్బర్ సింగ్ మాత్రమే. అది కూడా ఎలాంటి ఓటిటిలు లేని టైంలో. కాలం మారింది. సబ్ టైటిల్స్ నుంచి మల్టీ ఆడియోస్ లోకి డిజిటల్ కంపెనీలు వచ్చేశాయి. ప్రత్యేకంగా డబ్బింగ్ ఆర్టిస్టులను పెట్టుకుని మరీ అనువాదం చెప్పిస్తున్నాయి.

అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏదో తెలుగులోనో తమిళంలోనో ఆడేసిందని గుడ్డిగా తీసుకుంటూ పోతే చావు దెబ్బ తప్పదు. బాలీవుడ్ కు ఇది ప్రత్యక్షంగా అనుభవమవుతోంది. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన అల వైకుంఠపురములోని హిందీలో షెహజాదాగా రీమేక్ చేశారు. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంట. మొదటి రోజే వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ పెట్టినా సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా సూపర్ డిజాస్టర్ వైపు పరుగులు పెడుతోంది. దీనికన్నా గోల్డ్ మైన్స్ టీవీ ఛానల్ లో చూసిన డబ్ వెర్షనే బాగుందని నార్త్ ఆడియన్స్ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు.

Also Read – ఐపీఎల్ ఓటమి? జగన్ కు లింకేంటి?

ఇలాంటి షాకులు ఈ మధ్య కాలంలో ఇది మొదటిసారి కాదు. తమిళనాడులో సంచలనం రేపిన విక్రమ్ వేదాని హృతిక్ రోషన్ అంతటి పెద్ద స్టార్ తో తీస్తే యావరేజ్ అనిపించుకోవడానికే కిందా మీద పడింది. కబీర్ సింగ్ ఆడిందని జెర్సీని ఏరికోరి మరీ రీమేక్ చేయించుకున్న షాహిద్ కపూర్ కి అదో పీడకలలా మిగిలిపోయింది. అంతకు ముందు అక్షయ్ కుమార్ మన గద్దలకొండ గణేష్ (ఒరిజినల్ జిగర్ తండా)ని ముచ్చటపడి తీసుకుంటే మొదటి రోజు సాయంత్రం ఆటకే డెఫిషిట్లు పడి గోవిందా కొట్టింది.

విశ్వక్ సేన్ కి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన హిట్ ఫస్ట్ కేస్ ని రాజ్ కుమార్ రావు లాంటి టాలెంటెడ్ హీరో చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. ఇలా చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఒకప్పటిలా సౌత్ రీమేక్స్ ఇప్పుడు హిందీలో వర్కౌట్ కావడం లేదు. జనాలు బాగా తెలివి మీరిపోయి ఫలానా భాషలో ఓ హిట్టొచ్చని తెలిస్తే చాలు వెతికి మరీ సబ్ టైటిల్స్ సహాయంతో చూసేస్తున్నారు. ఈ కారణంగానే వచ్చే శుక్రవారం రిలీజ్ కాబోతున్న అక్షయ్ కుమార్ సెల్ఫి(డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్)అప్పుడే సోషల్ మీడియా నెగిటివిటీ మొదలైపోయింది. ఇకపై హక్కులు కొనే సమయంలోనే జాగ్రత్తగా ఉండాల్సిందే.

Also Read – రాజకీయ బలిపశువులుగా ఐఏఎస్, ఐపిఎస్‌ అధికారులు!