ప్రతిపక్షానికి వాక్ స్వాతంత్ర్యం ఎక్కువ… అధికార పార్టీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. కానీ పరిస్థితి తారుమారు అయినప్పుడు వాటి మాటలు, చేతలు కూడా అలాగే మారిపోతుంటాయి.
ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ సిఎంగా ఉన్నప్పుడు తన నాయకత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ నేతలను వెంటపెట్టుకొని ప్రత్యేక విమానంలో రాష్ట్రాలు పర్యటించడం తప్పు అనుకోలేదు.
బీఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకునేందుకు, తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని ఇతర రాష్ట్రాలలో పంచిపెట్టడం తప్పుగా అనుకోలేదు.
దేశ ప్రజలు కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని, ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని తమ చర్యలను గొప్పగా వర్ణించి చెప్పుకునేవారు.
కానీ ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి పదేపదే ఢిల్లీకి వెళ్తుంటే “అడుక్కోవడానికి వెళ్తున్నారా? లేక తెలంగాణ ప్రజల సొమ్ముని ఢిల్లీ పెద్దలకు ముట్టజెప్పేందుకు వెళ్తున్నారా?” అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ సంస్కృతి మొదటి నుంచీ ఉంది. కనుక కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నెలకొకసారి ఢిల్లీ వెళ్ళి అధిష్టానం దర్శనాలు, ప్రదక్షిణాలు చేసుకోక తప్పదు.
అలాగే ఇప్పుడు ఏ పార్టీ, కూటమికి చెందిన ముఖ్యమంత్రులైన నిధుల కోసం ఢిల్లీయే వెళ్ళాలి తప్ప వేరే చోటికి వెళ్ళలేరు కదా?
బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఫామ్‌హౌసుకి వెళ్ళి కేసీఆర్ దర్శనం చేసుకొని వస్తున్నారుగా? అది తప్పు కానప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి తమ అధిష్టానాన్ని కలిసి వస్తే తప్పేమిటి?అయితే అయన ఢిల్లీ పర్యటనలు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. అయన సమస్యలు ఆయనకుంటాయి.
నాడు కేసీఆర్ తెలంగాణ నష్టపోయినా పర్వాలేదు నా అహం మాత్రం దెబ్బతినకూడదనే ధోరణితో వ్యవహరించేవారు. అందుకే ఢిల్లీకి వెళ్ళేవారు కారు. కనీసం ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తే వెళ్ళి కలిసేవారు కారు.
ఇలాంటి వైఖరి వల్లనే ఆయన, బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కూడా చాలా నష్టపోయింది. కానీ దానినీ చాలా నేర్పుగా ‘తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష’గా మలిచి ప్రజలకు చెప్పుకుంటూ, ఆవిధంగా కూడా ‘అదనపు రాజకీయ మైలేజ్’ పొందాలని ప్రయత్నించేవారు.
కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి అటువంటి భేషజాలకు పోకుండా ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సినవి సాధించుకుంటున్నారు. కేసీఆర్ పదేళ్ళలో వరంగల్ విమానాశ్రయం సాధించలేకపోవడానికి, సిఎం రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ళలో సాధించడానికి కారణం ఇదే.
ఇవన్నీ మరిచి కేటీఆర్ ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి ఇంత చులకనగా ఎందుకు మాట్లాడగలుగుతున్నారంటే ముందే చెప్పుకున్నాము కదా ప్రతిపక్షానికి వాక్ స్వాతంత్ర్యం ఎక్కువని!




