రేవంత్‌ ఎఫెక్ట్ కూడానా… అయ్య బాబోయ్!

Revanth Reddy Jagan

తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ ఇప్పటికే వైసీపిలో కనిపిస్తోంది. అది ఇంతగా, ఇంత వేగంగా ప్రభావం చూపుతుందని వైసీపిలో ఎవరూ అనుకొని ఉండరు. అయితే ఇప్పుడు వారి అధినేతకు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి రూపంలో కూడా కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. అంటే ఆయనేమీ వైసీపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేదు.

ADVERTISEMENT

కానీ ఆయన చురుకుదనం, ప్రతీరోజూ ప్రజాదర్బార్‌ నిర్వహిస్తూ ప్రజలతో స్వయంగా మాట్లాడుతుండటం, ముఖ్యంగా… తనను ఎంతగానో అవమానించి, రాజకీయంగా సమాధి కట్టాలని ప్రయత్నించిన మాజీ సిఎం కేసీఆర్‌ని పరామర్శించడం వంటివి రేవంత్‌ రెడ్డిని ప్రజలలో హీరోగా మార్చేస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజునే మహాలక్ష్మి పధకంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణసౌకర్యం కల్పించడంతో మహిళలు కూడా సంతోషంతో పొంగిపోతున్నారు. టిఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, బెల్ట్ షాపుల మూసివేతకు ఆదేశాలు జారీ చేయడం వంటివి రేవంత్‌ రెడ్డి పాపులారిటీని అమాంతం పెంచేశాయని చెప్పవచ్చు.

రేవంత్‌ రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటికీ ఎంతో అనుభవం ఉన్నవాడిలా మంత్రిత్వ శాఖలను సమీక్షిస్తూండటం, చకచకా నిర్ణయాలు తీసుకొని అమలుచేయిస్తుండటం చూసి అందరూ చాలా సంతోషిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి అప్పుడే కేసీఆర్‌ని మరపింపజేస్తున్నాయి కూడా.

కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రులు ప్రజలను మెప్పించి తమవైపు తిప్పుకోవడానికి మొదట్లో ఇలాగే చేస్తారు. జగన్‌ సిఎం అయిన కొత్తలో ఇలాగే చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు నిత్యం బటన్ నొక్కుతూ ఇంకా మెప్పించాలనే ప్రయత్నిస్తున్నారు కూడా!

బిర్యానీ, పాయసం బాగున్నాయని రోజూ తినలేనట్లే సంక్షేమ పధకాల గురించి రోజూ వింటుండటం వలన వాటికి గుర్తింపు, విలువ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు జగన్, మంత్రులు వాటి గురించి డప్పు కొట్టుకోవలసి వస్తోందని చెప్పవచ్చు.

ఇప్పుడు ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణలో రేవంత్‌ రెడ్డి పాపులారిటీ పెరిగిపోవడం కూడా జగన్‌కు ఇబ్బందికరంగానే మారబోతోందని చెప్పవచ్చు. ఇంతకాలం ప్రజలు, మీడియా రెండు రాష్ట్రాల అభివృద్ధిని మాత్రమే పోల్చి చూసేవారు. కానీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డిల తీరుని కూడా పోల్చి చూడటం మొదలుపెట్టారు.

ప్రజాభవన్ బారికేడ్లు తొలగింపజేసి ప్రజలను లోనికి ఆహ్వానించి వారితో రేవంత్‌ రెడ్డి నేరుగా మాట్లాడుతుంటే, జగన్‌ తాడేపల్లి ప్యాలస్ చుట్టూ పోలీసులను కాపలా పెట్టుకొని ఎవరినీ దరిదాపులోకి రానీయడం లేదు. తాడేపల్లి ప్యాలస్‌కు కూతవేటు దూరంలోనే రాజధాని కోసం రైతులు గత 4 ఏళ్లుగా ఆందోళన చేస్తున్నా జగన్‌ ఏనాడూ వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. బటన్ నొక్కుడు సభలకు వెళ్ళినప్పుడు కూడా దారి పొడవునా బారికేడ్లు, పరదాలు కట్టుకొని, కర్ఫ్యూ విధించి, చెట్లు నరికించి వేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రజలతో కలిసిపోతుంటే, జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు దూరంగా ఉంటున్నారు.

రేవంత్‌ రెడ్డి ఆస్పత్రికి వెళ్ళి కేసీఆర్‌ని పరామర్శించి వస్తే, జగన్‌ చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించి చాలా పరిహాసాలు ఆడారు.

రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సమర్ధంగా, చురుకుగా, పారదర్శకంగా పనిచేస్తుందనే నమ్మకాన్ని ప్రజలకు వారం రోజులలోనే కలిగించగలిగారు. కానీ జగన్‌ నేటికీ రాజధాని కూడా ఏర్పాటుచేయలేకపోవడం వలన ప్రజల నమ్మకాన్ని కోల్పోతూనే ఉన్నారు. అందుకు తన ఎమ్మెల్యేలను బలిపశువులు చేస్తున్నారనే అభిప్రాయం అప్పుడే ప్రజలలో ఏర్పడుతోంది కూడా.

కనుక అక్కడ రేవంత్‌ రెడ్డి పాపులారిటీ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ జగన్‌ పాపులారిటీ తగ్గుతూనే ఉండవచ్చు. ప్రజలు జగన్‌ని చూసే వైసీపికి ఓట్లు వేస్తారు. కనుక ఎన్నికలకు ముందు రేవంత్‌ రెడ్డి కారణంగా జగన్‌ పాపులారిటీ తగ్గడం వైసీపికి తీరని నష్టం కలిగించే అవకాశం కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories