ఏపీలో జగన్ పాలన ఉండవల్లి ప్రజావేదిక విధ్వంసంతో మొదలై నేటికీ ఏమాత్రం ఆ స్పూర్తి, నిబద్దత కోల్పోకుండా కొనసాగుతోంది. విధ్వంసాన్ని కూడా ఇంత నిబద్దతతో చేస్తుండటం చాలా గొప్ప విషయమే కదా?ఇంతకాలం తెలంగాణ అభివృద్ధిని చూసిన కళ్ళతో ఏపీని చూస్తుండటం వలన ఈ ఆర్ధిక, సామాజిక, రాజకీయ విధ్వంసం 70 ఎంఎం తెరపై చూస్తున్న ఫీలింగ్ కలిగేది.
కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూడు నెలల్లోనే అటువంటి నిబద్దత ప్రదర్శిస్తుండటంతో జగన్ ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలిగించే విషయమే అవుతుంది.
ప్రగతి భవన్ చుట్టూ కేసీఆర్ నిర్మించుకున్న ఇనుప గోడలను తొలగింపజేసినప్పుడు, కేసీఆర్ ముచ్చట పడి కట్టుకున్న ప్రగతి భవన్ పేరుని ప్రజాభవన్‌గా మర్చి, జనాలను లోనికి రానిచ్చినప్పుడు జేజేలు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీ అమలుచేస్తున్నప్పుడు జనాలు జేజేలు పలుకుతున్నారు.
తెలంగాణ అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన విషయంలో సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే చాలా చురుకుగా, పారదర్శకంగా ముందుకు సాగుతుండటం చాలా అభినందనీయమే.
అయితే తన ప్రభుత్వానికి కేసీఆర్ రూపంలో రాజకీయ గండం పొంచి ఉన్నందున, రేవంత్ రెడ్డి తన జాగ్రత్తలో తాను ఉండాలనుకున్నారు. సరిగ్గా ఇదే ఆయన పాలనను వేరే మార్గంలోకి నడిపిస్తోందని చెప్పవచ్చు. కేసీఆర్ హయాంలోనే క్రుంగిన మేడిగడ్డ బ్యారేజికి కాంగ్రెస్ ప్రభుత్వం మరమత్తులు చేయించకుండా కాలక్షేపం చేస్తుండటాన్ని ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
కేసీఆర్ తన ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలు చేస్తున్నందున, సిఎం రేవంత్ రెడ్డి కూడా బిఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీసేందుకు పావులు కదుపుతున్నారు. ఏ కాళేశ్వరం ప్రాజెక్టు వలన కేసీఆర్‌కు అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయో దాంతోనే కేసీఆర్ పేరుప్రతిష్టలని నామరూపాలు లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు…. అని హరీష్ రావు ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజికి మరమత్తులు చేయకుండా తాత్సారం చేస్తూ వర్షాకాలంలో వరదలకు బ్యారేజి మొత్తం కొట్టుకుపోయేలా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజికి మరమత్తులు చేయకుండా విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో బ్యారేజిలో నీళ్ళు నిలువచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటి బ్యారేజి మేడిగడ్డ దెబ్బ తింటే దానికి అనుసంధానమై ఉన్న అన్ని ఎత్తిపోతల పధకాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే తెలంగాణలో మళ్ళీ నీళ్ళు లేక భూములు బీడువారుతాయి. రైతుల సమస్యలు మళ్ళీ మొదటికి వస్తాయి…. అని బిఆర్ఎస్ పార్టీ హెచ్చరికలను కొట్టిపడేయలేము. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని రాజకీయ కోణంలో నుంచే చూస్తూ బ్యారేజి మరమత్తులకు చర్యలు చేపట్టకుండా కాలక్షేపం చేస్తోంది.
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిని పాడు బెట్టడంతో దీనిని పోల్చవచ్చు. ఏపీని భవిష్యత్‌ని సమూలంగా మార్చివేయగల అమరావతిని జగన్ ప్రభుత్వం పాడుపెట్టడంతో ఈ 5 ఏళ్ళలో రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తుండటం చాలా ఆందోళన కలిగించే విషయమే.
అయితే ఏపీలో జగన్ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నందున దాని ఆటలు సాగుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే అదనంగా ఉన్నారు. కనుక రాజకీయాల కోసం రైతులకు, రాష్ట్రానికి ఉద్దేశ్యపూర్వకంగా నష్టం కలిగిస్తే, అప్పుడు పార్టీలోనే తిరుగుబాటు జరిగి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడే తన దారి సరిచేసుకొని ముందుకు సాగితే మంచిది.




