ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ట్రాఫిక్ నిబంధలను కాస్త కఠినం చేస్తూ ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. ఈ ట్రాఫిక్ నిబంధలలో హెల్మెట్ వాడకం పై కోర్టులు కూడా చాల సీరియస్ గా ప్రభుత్వాలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.
హెల్మెట్ వినియోగం పై వాహనదారులకు పూర్తి అవగాహన కల్పించడం, వాటి వాడకానికి వినియోగదారులను సిద్ధం చేయడం అధికారుల విధి అన్నట్టుగా న్యాయస్థానాలు హెల్మెట్ వాడకం పై నిబంధలను కఠినతరం చేసాయి. దానికి తగ్గట్టే ట్రాఫిక్ పోలీసులు కూడా హెల్మట్ వాడని వాహనదారుని పై ఫైన్ ల రూపంలో కొరడా జులిపిస్తు వారిని హెల్మెట్ వాడకం వైపు నడిపిస్తున్నారు.
దీనితో గతంతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో టూ వీలర్ వాహనదారులలో హెల్మెట్ వాడకం గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ట్రాఫిక్ నిబంధలు అమలు తో పాటు వీటి ఉల్లంఘనని కట్టడి చేసేందుకు మరో కొత్త రూల్ ని ప్రతిపాదించారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు గాను ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చలానా విధిస్తారు. సదరు వాహనం నెంబర్ మీద ఈ చలానా అనేది నమోదవుతుంది. అయితే ఆ నమోదైన చలానా ను వాహనదారుడు వెనువెంటనే చెల్లించాల్సిన పని ఉండేది కాదు, అలాగే ఆ చెల్లింపుపై ఒక నిర్దిష్ట సమయ పరిమితి అనేది కూడా ఉండేది కాదు.
వాహనాదారుడి ఇష్టం మేరకు ఆ చెల్లింపు అనేది జరిగేది, కానీ ఇప్పుడు వాహనం పై చలానా నమోదు అయిన తక్షణమే సదరు వాహనదారుడు ఖాతా నుండి నగదు కట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తద్వారా ట్రాఫిక్ నిబంధలు విషయంలో వాహనదారులు జాగ్రత్త వహిస్తారు అనేది వీరి ఉద్దేశం కావచ్చు.
ఒక టోల్ గేట్ దాటగానే వాహన యజమాని ఖాతా నుండి ఎలా అయితే డబ్బు కట్ అవుతుందో అదే మాదిరి ఒక ట్రాఫిక్ పోలీస్, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వాహనం పై చలానా విధించిన మరుక్షణమే సదరు వాహన యజమాని ఖాతా నుండి కూడా అదే విధంగా మనీ ఆటోమాటిక్ గా కట్ అయ్యేలా బ్యాంకు అకౌంట్ తో లింక్ చెయ్యాలంటూ రేవంత్ వ్యాఖ్యానించడం పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది ప్రజలను బాదడమే, ఈ రూల్స్ అన్ని కూడా కేవలం సామాన్యుడి నడ్డి విరిచేందుకే అంటూ కొందరు రేవంత్ నిర్ణయం పై నిట్టూరుస్తుంటే, నిబంధలను కఠినతరం చేయడంలో భాగమే ఈ రూల్, దీనితో రోడ్డు పై ఇస్టానుతీరిగా వ్యవహరించే వాహనదారులను అప్రమత్తం చేయడం తో పాటు వారిని మరోసారి అదే తప్పు చేయకుండా జాగ్రత్త చేస్తుంది అంటూ రేవంత్ ప్రతిపాదనలను స్వాగతిస్తున్నవారు మరికొందరు.






