ఒకప్పుడు వందేళ్ళ జీవితం… కానీ ఇప్పుడు అంత జీవితం మాకొద్దనుకుంటున్నారు చాలా మంది. ఎవరి కారణాలు వారికున్నాయి. ఆ కారణాలకు చదువులు, ఉద్యోగాల ఒత్తిడి, కుటుంబం లేదా వైవాహిక సమస్యలు వంటి బలమైన కారణాలు చాలానే ఉన్నాయి.
ఇవి కాక సినిమాలు, మొబైల్ ఫోన్లు, స్నేహితులు వంటివి కూడా కౌమార్య దశలో ఉన్న పిల్లలని సొంతంగా ఆలోచించనీయడం లేదు. వాటి ప్రభావంలో ఉన్నవారు హైస్కూల్లోనే ప్రేమలు, షికార్లు, విరహాలు, బ్రేకప్‌లు వరకు చాలా దశలు దాటేస్తున్నారు.
హైస్కూల్ దశలోనే ఇన్ని చూసేసిన టీనేజ్ పిల్లలు కాలేజీ చదువులు పూర్తయ్యేలోగా ‘మిగిలిన దశలు’ దాటేసి కొందరు పెళ్ళి మండపాలలో తేలితే మరి కొందరు సీలింగ్ ఫ్యానుకి వ్రేలాడుతారు లేదా ఏ చెరువులోనో తేలుతారు. ఇందుకు ఎవరు ఎవరిని నిందించాలో తెలీని పరిస్థితి.
తాజా ఉదాహరణగా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో పెద్దల ఆమోదంతో సెప్టెంబర్ 26న ఓ ప్రేమ జంట పెళ్ళి జరిగింది. కానీ ఈ నెల 2న భార్య భర్తలకు భోజన సమయంలో చిన్న గొడవ జరిగింది. మర్నాడు ఆమె ఆత్మహత్య చేసుకుంది!
22-23 ఏళ్ళకే వారి ప్రేమ పెళ్ళితో సుఖాంతం కావడం బాగానే ఉంది. కానీ ఆమె పెళ్ళైన వారం రోజులకే చిన్న గొడవతో ఆత్మహత్య చేసుకోవడం చూసినప్పుడు ఒకరినొకరు అర్ధం చేసుకోకుండానే ప్రేమించుకున్నారా? పెళ్ళి చేసుకున్నారా? అని సందేహం కలుగుతుంది. ప్రేమకు, పెళ్ళికి తొందర పడ్డారు సరే… చావడానికి కూడా తొందరేనా?అనిపించక మానదు.
పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని లేదా ఫెయిల్ అయ్యామని, మొబైల్ ఫోన్, బైక్ లేదా స్కూటీ కొనివ్వలేదని, జీవిత భాగస్వామితో గొడవపడి ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నప్పుడు మన సమాజాన్ని మళ్ళీ పునాది నుంచి బలంగా నిర్మించుకోవలసిన అవసరం కనిపిస్తోంది.
పొరపాటు ఎక్కడ జరుగుతోందో స్పష్టంగా కనిపిస్తోంది. కనుక తల్లి తండ్రులు, గురువులు పిల్లల మార్కులు మాత్రమే కాదు వారిలో వస్తున్న మార్పులు కూడా నిశితంగా గమనించాలి. చదువులు మాత్రమే కాదు జీవితానికి అవసరమైన జీవిత పాఠాలు కూడా తరగతి గదుల్లో భోదించడం చాలా అవసరం. వాస్తవ జీవితానికి, కలల ప్రపంచానికి మద్య ఉన్న అంతరాన్ని పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పగలిగినప్పుడు, నిజమైన భావి భారత పౌరులు తయారవుతారు.
చివరిగా ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడు చెప్పిన మాట… ప్రతీ వ్యక్తి జీవితంలో మొదటి 30 ఏళ్ళలో ఎవరైతే చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు లేదా ఉపాధిలో సెట్ అవగలరో, వారు మిగిలిన జీవితం సుఖంగా బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కానీ జీవితంలో చాలా కీలకమైన మొదటి 30 ఏళ్ళలోగా వివిధ ఆకర్షణలలో చిక్కుకొని దారి తప్పితే మిగిలిన జీవితం అంతా అష్టకష్టాలు తప్పవు.







