చిరంజీవి నాటిన ‘మెగా’ వృక్షం క్రింద పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్… ఇలా మెగా హీరోల పేర్లు నానాటికి పెరుగుతూ పోతుండగా, తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో రాబోతున్నాడనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా, త్వరలో మెగా కాంపౌండ్ నుండి మరో సినీ వారసుడు రంగ ప్రవేశం చేయబోతున్నాడని టాక్.
ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంటున్న సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా సినీ హీరోగా అడుగుపెట్టడం ఖాయమన్న టాక్ వినపడుతోంది. ఇదే ప్రశ్న సాయిని అడిగితే, ప్రస్తుతం చదువుకుంటున్నాడు, ఇప్పుడే సినిమాలేంటి? అని అన్నారు తప్ప, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టరని చెప్పలేదు. విద్యాబుద్ధులు ముగిసిన తర్వాత తదుపరి అడుగు సినీ హీరోనే అని పరోక్షంగా సాయి చెప్పాడన్న మాట.
ఇదిలా ఉంటే వైష్ణవ్ గురించి ఇలా వార్తలు వచ్చాయో లేవో, అప్పుడే మెగా అభిమానుల్లో వైష్ణవ్ కు సంబంధించిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. లుక్స్ పరంగా సోదరుడు సాయి ధరమ్ తేజ్ కంటే బాగున్నాడంటూ కితాబిచ్చేస్తున్నారు. మరో విషయమేమిటంటే… సాయి చెప్తున్నట్లు వైష్ణవ్ చదువుకుంటోంది సినీ పాఠాలని (యాక్టింగ్ క్లాస్ లని) ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.



