మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “తిక్క” సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సాయి గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో ఈ ‘తిక్క’పై అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఆడియో వేడుకపై పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలు చేయడంతో ‘తిక్క’కు మరింత పబ్లిసిటీ ఏర్పడింది. మరి ఇంత ‘రచ్చ’ మధ్య విడుదలైన ‘తిక్క’కు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? అంటే… ఇప్పటికే షోలు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ ‘తిక్క’ను మరియు టైటిల్ సాంగ్ ను ఉపయోగించుకుని… సోషల్ మీడియాలో పంచ్ లు పేలుతున్నాయి. ఫస్టాఫ్ ఎక్కలే… సెకండాఫ్ చుక్కలే… ఫైనల్ గా బొక్కలే బొక్కలే… అంటూ ‘తిక్క’ గురించి రచ్చ రచ్చ చేస్తున్నారు. అలాగే ‘తిక్క కుదిరింది బ్రదర్’ అంటూ హ్యాష్ ట్యాగ్ లు పెడుతూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా శుక్రవారం నాడు విడుదలైన ‘బాబు బంగారం’ సినిమాకు భిన్న స్పందనలు వచ్చిన నేపధ్యంలో… ఈ టాక్ ను ‘తిక్క’ అనుకూలంగా మార్చుకుంటుందని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ, ‘తిక్క’కు వచ్చిన టాక్ చూస్తుంటే… ఈ సెలవుల రోజుల్లో ‘బాబు బంగారం’ పంట పండేలా కనపడుతోంది.
‘పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్’ సినిమాల కమర్షియల్ సక్సెస్ నేపధ్యంలో మంచి భవిష్యత్తు ఉన్న మెగా హీరోగా భావించిన సాయి ధరమ్ తేజ్ కు బహుశా ఈ ‘తిక్క’ ఫలితం ఊహించనిదేమో! అయితే విజయం సాధించిన మూడు సినిమాలు కూడా దిల్ రాజు నిర్మాతగా తెరకేక్కినవి కాగా, మొదటిసారిగా వేరే నిర్మాతతో సాయి జత కట్టడం, అది బాక్సాఫీస్ వద్ద బ్లాస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.



