హలో వీసీ సజ్జనార్‌ హియర్….

Sajjanar Warns Public After Fake Profile Cyber Scams

వీసీ సజ్జనార్‌ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇంతకాలం టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా ఆ సంస్థను చాలా సమర్ధంగా నడిపించారు. ఇప్పుడు హైదరాబాద్‌ సీపీగా మళ్ళీ పోలీస్ యూనిఫారం వేసుకున్నారు. రీల్స్, లైకుల పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకొంటున్న లేదా సమస్యలలో చిక్కుకొంటున్న యువతని హెచ్చరించడంలో ఎప్పుడూ ముందుంటారు.

అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ నేరాలు, మోసాల గురించి వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. కానీ ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఆయన పేరు, డీపీలో అయన ఫోటో పెట్టుకునే జనాలను మోసం చేస్తున్నారు.

ADVERTISEMENT

ఈ విషయం తెలుసుకున్న వీసీ సజ్జనార్‌ వెంటనే సోషల్ మీడియాలో ఆ పోస్ట్ క్లిప్ పెడుతూ తన పేరుతో ఎవరైనా ఫోన్లు చేసినా, మెసేజులు పెట్టినా పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్‌ పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేయడమే పెద్ద సాహసం కాగా సైబర్ నేరగాళ్ళు ఆయన పేరుతో ప్రజలకు ఫోన్లు, మెసేజులు పెడుతూ మోసగించాలనుకోవడం దుసాహసమే.

కనుక హైదరాబాద్‌ సైబర్ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని తమ పోలీస్ కమీషనర్ పేరిట ప్రజలను బెదిరించి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ళని కనిపెట్టే పనిలో పడ్డారు.

హైదరాబాద్‌ వంటి మహానగరానికి పోలీస్ కమీషనర్‌గా ఉన్న వ్యక్తినే సైబర్ నేరగాళ్ళు వాడేసుకుంటున్నప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే చాలా ఆందోళన కలుగుతుంది.

కనుక ప్రజలు ఈ సైబర్ నేరాల పట్ల అవగాన పెంచుకుంటూ వాటిని గుర్తించడం, వాటి నుంచి తప్పించుకోవడం లేదా దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లేకుంటే ఏదో రోజు మనకీ నంబర్ వచ్చేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories