వైసీపీ అధినేత సిఎం చంద్రబాబు నాయుడుని ద్వేషిస్తుంటారు. కనుక అదే వైసీపీ విధానంగా మార్చేసుకున్నారు. జగన్ సొంత మీడియా అందుకు భిన్నంగా ఉంటుందని అనుకోలేము. కనుక అది కూడా ఆ విధానంతోనే జగన్‌కు మనస్పూర్తిగా శల్య సారధ్యం చేస్తోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఈరోజు సాక్షి ఆన్‌లైన్ ఎడిషన్‌లో “ప్రజల సొమ్ము గంగపలు చేయొద్దు” అనే టైటిల్‌తో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఏపీలో పోలవరం ప్రాజెక్టుల గురించి ఓ కధనం ప్రచురించింది.
దాని ప్రధాన ఉద్దేశ్యం సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించడం. పోలవరం విషయంలో ఆయన చేస్తున్న తప్పులని ఎత్తి చూపడం.
కానీ ఆ ప్రయత్నంలో కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తి పడి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఏవిదంగా అవినీతికి పాల్పడ్డారో చక్కగా వివరించారు.
కేసీఆర్ గొప్పలకు పోయి మూడేళ్ళలోనే హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం కోసం ఎన్ని తప్పులు చేశారో చక్కగా వివరించారు.
కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆ ప్రాజెక్టు, ఆయన దిగి పోయేలోగానే క్రుంగిపోయిందని, ఇప్పుడు అది పనికిరాకుండా పోయిందని దానిలో పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు కూడా అచ్చం కేసీఆర్‌లాగే మూడేళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని ప్రకటించేశారని, చివరికి ఇది కూడా నిరుపయోగంగా మిగిలిపోనున్నదా?అని సందేహంతో ముగించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సాక్షి మీడియా వ్రాసినవన్నీ నిజాలే అని అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడుని విమర్శించే హడావుడిలో సాక్షి మీడియా రెండు విషయాలు మరిచిపోయింది.
1. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరయ్యి బటన్ నొక్కి ప్రారంభించారు.
2. కేసీఆర్, జగన్ మద్య బలమైన బంధం ఉంది. వారిరువురూ ఒకరికి మరొకరు మేలు చేసుకుంటారే తప్ప విమర్శించుకోరు. ముఖ్యంగా ఇలాంటి విషయాలు బయటపెట్టుకోరు.
ఈ రెండు విషయాలు మరిచిపోయి జగన్ మనసాక్షి కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసి ఎందుకూ పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, అది కూడా కూలిపోయేలా ఉందని, కూలకపోతే కూల్చేసి కొత్తది కట్టుకోక తప్పదని ఎడాపెడా వాయించేసింది మన.. సాక్షి. అటువంటి ప్రాజెక్టుని కేసీఆర్, జగన్ కలిసి ప్రారంభించారనే విషయం చెప్పడం మరిచిపోయినట్లుంది.
చంద్రబాబు నాయుడుని విమర్శించాలంటే పోలవరం కధ వ్రాసుకుంటే సరిపోయేది. కానీ పోలిక కోసం కాళేశ్వరం ప్రాజెక్టుని ఎత్తుకోవడం, దాని గురించి వివరించే ప్రయత్నంలో కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేయడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.. కదా?




