దాదాపు గత నెల రోజులుగా హల్చల్ చేస్తున్న సమంత – నాగచైతన్యల జోడి కధపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. ‘బ్రహ్మోత్సవం’ ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి గురించి సమంత చేసిన కామెంట్స్ తో రేగిన దుమారం ‘అ… ఆ…’ విడుదల తర్వాత సోషల్ మీడియాలో లీకైన ఫోటోతో తారాస్థాయికి చేరింది. అయితే దీనిపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో కాస్త సర్దుమణిగినట్లుగా కనపడగా, తాజాగా వీరిద్దరిపై మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఇప్పటికే ‘ఏ మాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మనం’ చిత్రాలలో జోడిగా నటించిన సమంత – చైతూలు కలిసి మరో సినిమాలో నటించబోతున్నారనే సమాచారం మళ్ళీ హాట్ హాట్ గా మారింది. ఓ పక్కన పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలోనే.., వాటికి మరింత బలం చేకూరేలా మరో సినిమాలో ఈ ఇద్దరూ జంటగా కనపడనుండడం… సినీ జనాల్లో మరిన్ని చర్చలకు దారి తీసింది.
‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చైతూ నటించబోయే సినిమాలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసారని టాక్. ఇటీవల కాలంలో చెర్రీ – కాజల్ జోడి మినహా నాలుగు సార్లు వెండితెరపై ఇచ్చిన జోడి మరేది లేదు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే చైతూ – సమంతలు ఆ రికార్డును సమం చేస్తారు. ప్రస్తుతం ‘సాహాసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్’ సినిమాలతో బిజీగా ఉన్న చైతూ, ఈ రెండు పూర్తయిన తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నారు.



