కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న సినిమా గత దసరా కానుకగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం హంగామా చేస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదల తర్వాత సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాలోకి ఇద్దరు ముద్దుగుమ్మలను ఫైనల్ చేసినట్లు సమాచారం.
ఎన్టీఆర్ సరసన ఇప్పటికే మూడు చిత్రాల (బృందావనం, రభస, రామయ్య వస్తావయ్యా)లో కలిసి నటించిన సమంతను మరియు అభినయానికి మారు పేరుగా నిలిచే నిత్యామీనన్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఈ ఇద్దరు భామలు కలిసి నటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం స్క్రిప్ట్ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో దర్శక నిర్మాతలు చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరియు సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ల సెలక్షన్ ఇప్పటికే జరిగిపోయింది. ‘శ్రీమంతుడు’ సినిమా ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళక ముందు నుండే భారీ స్థాయి అంచనాలను ఏర్పరచుకుంది.





