సినిమా హీరోలు, హీరోయిన్లు ఖాళీ దొరికితే విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ బీచ్‌లు, నదులు, పర్వతాలు, నగరాలలో ఎంజాయ్ చేసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతుంటారు. అవి చూసి మనం మురిసిపోతుంటాము.
అలాగే మధ్యతరగతి నుంచి ఉన్నతాదాయ వర్గంలోకి మారినవారు సైతం కుదిరితే సింగపూర్, మలేషియా, దుబాయ్ వెళ్ళి వచ్చేస్తున్నారు.
నిష్టగా మధ్యతరగతిలో ఉండిపోయినవారు మాత్రం క్రమం తప్పకుండా ఓసారి తిరుపతికి కుదిరితే మరోసారి కాశీ, అయోధ్య, రామేశ్వరంకి వెళ్ళివస్తుంటారు.
ఎవరి ఆర్ధిక స్తోమతు, అభిరుచులు, పరిమితులను బట్టి వారు విహారయాత్రలు, తీర్ధయాత్రలు చేస్తుంటారు. కనుక ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
కానీ అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలను చూద్దామనుకునేవారు ఎంతమంది? అంటే సమాధానం చెప్పడం కష్టమే. దీనికి ప్రజలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక కేంద్రాలున్నాయని ఏ ప్రభుత్వమూ చెప్పుకోదు. ఒకవేళ చెప్పుకున్నా అక్కడ ఎటువంటి కనీస వసతి, భోజన సౌకర్యాలు కల్పించదు. కనీసం పరిశుభ్రత కూడా ఉండదు. లైట్లు, టాయిలెట్లు వంటి ప్రాధమిక వసతుల మొదలు పోలీసుల రక్షణ, రవాణా సదుపాయాలు వంటివి కూడా ఉండవు.
కొన్ని ప్రధాన పర్యాటక కేంద్రాలకు మాత్రమే ఇవన్నీ పరిమితం. మిగిలిన చోట్ల ఎవరి తిప్పలు వారు పడాల్సిందే. నేటికీ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి.
విశాఖలో భీమిలి బీచ్, రుషికొండ బీచ్, తెన్నేటి పార్కు బీచ్, అత్యంత ఫేమస్ రామకృష్ణా బీచ్ ఉన్నాయి. కానీ ఎక్కడ చూసినా చెత్తాచెదారం, మురికి కాలువలతో ఆశుభ్రంగా ఉంటాయి.
బీచ్ పార్కులలో లైట్లు ఉండవు. ఒకవేళ ఉన్నా చీకటిపడితే వెలగవు. కనుకనే ఆంధ్రా పర్యాటకులు వేరే రాష్ట్రాలకో లేదా సకల సదుపాయాలు ఉన్న పుణ్యక్షేత్రాలకో వెళ్ళి వస్తుంటారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, ఏడాది పొడవునా శ్రీశైలం జలాశయంలో మునిగి ఉండే సంగమేశ్వర ఆలయం, జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో మెల్లగా బయటపడుతోంది.
నీళ్ళలో ఉన్న గుడి పూర్తిగా బయటపడాలంటే నీటిమట్టం కనీసం 837 అడుగులకు చేరాలి. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 859.3 అడుగులుంది. ప్రస్తుతం రోజుకు సుమారు ఒక అడుగు చొప్పున నీటిమట్టం తగ్గుతోంది. అంటే మరో రెండు వారాలలలో స్వామివారిని దర్శించుకోవచ్చన్న మాట.
మనదేశంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో సముద్రంలో మునిగి ఉండే దేవాలయాలున్నాయి. అవి కూడా ఇలా అప్పుడప్పుడు బయటపడుతుంటాయి.
వాటి గురించి ఆయా రాష్ట్రాలు జోరుగా ప్రచారం చేసుకుంటాయి. కనుక మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు.
మరి మన సంగమేశ్వర స్వామివారి గురించి ఎంత మందికి తెలుసు? తెలియని వారికి పర్యాటకశాఖ తెలియజేసే ప్రయత్నం చేస్తోందా?







