ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ లో అనుకోని విధంగా మెరుపులు మెరిపించి ఇషాన్ కిషన్ చాలా అకస్మాత్తుగా జట్టు తుది-11 లో చోటు దక్కించుకుని, వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకుని జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వచ్చే టి-20 ట్రోఫీ కు తానే ఫస్ట్-ఛాయిస్ విక్కీ-బ్యాటర్.
అయితే న్యూజిలాండ్ సిరీస్ మొదలుకు ముందు వరుకు కూడా భారత జట్టుకు ఖరారయింది వికెట్-కీపర్ సంజు శాంసన్. ఈ కేరళ కుర్రాడు కెరీర్ లో రెండవ సారి టి-20 వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా చేజార్చుకున్నట్లే చెప్పవచ్చు. న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో ఘోర పెర్ఫామెన్స్ దృష్ట్యా సంజు తుది-11 లో తన చోటును కోల్పోవాల్సి వచ్చింది.
అలాగే 2024 టి-20 వరల్డ్ కప్ జట్టు ఖరారు చేసే కొద్ది నెలల ముందు సంజు ఫామ్ కోల్పోయి తుది-11 లో తన చోటును కోల్పోయాడు. కానీ, 2024 టి-20 వరల్డ్ కప్ తరువాత విరాట్-రోహిత్ ల రిటైర్మెంట్ తో ఓపెనింగ్ స్థానాల్లో అవకాశం దక్కగా సంజు తొలుత ఆ స్థానాన్ని గట్టిగా ఖాయం చేసుకున్నట్టే కనిపించాడు.
సొంత పిచ్ల పై జరిగిన బంగ్లా సిరీస్ లో దుమ్ములేపుతూ సెంచరీ చేయగా, ఆ పై సౌత్ ఆఫ్రికా వెళ్లి అక్కడ మరొక సెంచరీ బాది తన ఆట పై వచ్చిన విమర్శలన్నిటికి చెక్ పెడుతన్నట్టే కనిపించాడు. భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు కూడా సంజు మీద ఉన్న నమ్మకంతో ఈసారి టి-20 ట్రోఫీ కు సంజు పక్కా అనుకున్నారు ఫాన్స్ అంతా.
కానీ, తన కెరీర్ మొదటినుండి సంజు కు ఏది అనుకున్నట్టుగా జరగలేదు. మరోసారి దీన్ని నిజమని నిరూపించటానికి టి-20 వరల్డ్ కప్ ను సరిగ్గా 12 నెలలు ఉంది, ఇక నుండి జట్టు సమతుల్యతలను దగ్గరగా చూసుకోవాలి అని మేనేజ్మెంట్ భావించినప్పటి నుండి సంజు బ్యాట్ రన్స్ కు దూరమయింది.
2025 జనవరి లో ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 సిరీస్ లో తేలిపోయిన సంజు, పలుసార్లు ఒకటే బాల్ కు అవుట్ అవటంతో ఫాన్స్ కే సంజు ఆటపై అసంతృప్తి కలిగింది. ఆ పై జరిగిన ఐపీఎల్-2025 లో కూడా సంజు ఫామ్ కోలుకున్నట్టేమీ కనిపించలేదు. 9 మ్యాచ్లకు గాను 285 పరుగులు చేసి ఓకే-ఓకే అనిపించే పెర్ఫామెన్స్ నే ఇచ్చాడు.
ఇక ఐపీఎల్ పూర్తయ్యాక శుబ్మాన్ గిల్ ఆల్-ఫార్మటు ప్లేయర్ గా అవతరించటంతో ఆసియ కప్ మరియు సౌత్ ఆఫ్రికా పై సిరీస్ లను మిస్ అయ్యాడు సంజు. ఇక, తిరిగి శుబ్మాన్ ను టి-20 ఫార్మటు నుండి దూరం పెట్టటంతో సంజు పొట్టి ఫార్మటు లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు.
కానీ, ఈ ఎంట్రీ సంజు ఫామ్ కు ఏ మాత్రం ఉపయోగపడకపోగా, జట్టులో ఉన్న స్థానాన్ని కూడా కోల్పోయేలా చేసింది. ప్రతి మ్యాచ్ లో విఫలమవుతూనే వచ్చినా అతని మీద నమ్మకం ఉంచి 5 మ్యాచ్ లలో అవకాశమిచ్చిన టీం సెలెక్టర్లకు సంజు నిరాశే మిగిల్చారు. 5 మ్యాచ్లకు కలిపి 46 పరుగులు చేసి ఘోరంగా సిరీస్ ను ముగించుకున్నాడు సంజు.
సిరీస్ లో చివరి మ్యాచ్ తన సొంత గ్రౌండ్ తిరువునంతపురం అవటంతో అభిమానులంతా ఆ మ్యాచ్ తో సంజు ఫామ్ అందుకుంటాడనుకున్న ఆశలన్నీ సంజు ఆవిరి చేసారు. నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా వార్మ్ అప్ మ్యాచ్ లో కనీసం బ్యాటింగ్ కు రాలేదు సంజు.
ఇలా ఇప్పటికే కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన సంజు శాంసన్ కు ఈసారి గట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పవచ్చు. అయితే, ఇప్పటికే కచ్చితంగా ఆడతాడనుకున్న ఒక వరల్డ్ కప్ ఛాన్స్ ను సంజు 2024 లో పోగొట్టుకున్నాడు. అదృష్టం కలిసొచ్చి ఈసారి సంజు కు వరల్డ్ కప్ లో ఒక్క అవకాశమైనా దొరుకుతుందా లేదా అనేది చూడాలి..!






