సెన్సార్ బోర్డ్ సభ్యులు హానెస్ట్ ఫిలిం మేకర్స్ కి ఎప్పుడూ పంటి కింద రాయి లాంటోళ్లే. ఫిలిం మేకర్స్ సృజనాత్మకతను, వారి స్వేచ్ఛను అణగదొక్కడాంకే సెన్సార్ సభ్యులు ఉంటారు అనేది కొన్నాళ్ల క్రితం జోరుగా సాగిన వాదన. ఆ తర్వాత కొన్ని వెసులుబాట్లు క్రియేట్ చేసుకుని తమ సినిమాలని బయటకి తీసుకొచ్చుకున్నారు ఫిలిం మేకర్స్.
తెలుగు సినిమా దర్శకనిర్మాతలకి ఓ లేడీ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ చుక్కలు చూపించేది. ముఖ్యంగా రిలీజ్ కి ముందు స్లాట్ బుక్ చేసుకుంటే.. ఆఖరి నిమిషం వరకు సర్టిఫికేట్ చేతికందించేది కాదు, ఆమెను మార్పించాల్సిందిగా బడా బడా ప్రొడ్యూసర్లు, హీరోలు, దర్శకులు విశ్వప్రయత్నం చేసి.. ఎట్టకేలకు సాధించుకున్నారు అనుకోండి.
అయితే.. ఇప్పుడు మళ్లీ ఇంచుమించుగా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది తెలుగు చిత్రసీమ. “సరస్వతి, హే భగవాన్” వంటి సినిమాల విషయాల్లో టైటిల్స్ మార్చమని కోరడాన్ని అర్థం చేసుకోగలం కానీ.. కొన్ని డైలాగ్స్ & సీన్స్ విషయంలో వాళ్లు చూపిస్తున్న అతి జాగ్రత్త దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారింది.
రీసెంట్ గా “సమ్మర్ హాలీడేస్” అనే సినిమా టీజర్ లో పిర్ర అనే డైలాగ్ ను ముడ్డి అనే మాటతో రీప్లేస్ చేయించారు. నిజానికి పిర్ర అనేది స్వచ్ఛమైన తెలుగు పదం, అందులో ఇసుమంతైనా బూతు లేదు. దాన్ని ఎందుకు మార్పించాల్సి వచ్చింది అనేది అర్థం కాని విషయం. ఇక ఈవారం విడుదలవ్వాల్సిన “రంభ ఊర్వశి మేనక” సినిమా విషయంలోనూ సెన్సార్ సభ్యుల అతిజాగ్రత్త మేకర్స్ కి తలనొప్పిగా మారింది. సినిమాలో రంభ, ఊర్వశి, మేనకల కాస్ట్యూమ్స్ మరీ రివీలింగ్ గా ఉన్నాయి, వాటిని మార్చండి అని చెప్పారట.
షూటింగ్ మొత్తం అయిపోయిన సినిమాకి కాస్ట్యూమ్స్ ఎలా మారుస్తారు? పోనీ ఇప్పుడు గ్రాఫిక్స్ లో చీరలు యాడ్ చేద్దామన్నా మేకర్స్ కి ఖర్చు పెలుద్ది, పైగా చూడ్డానికి బాగోదు కూడా. వందల సంవత్సరాలుగా దేవతలు ఇలానే ఉంటారు అని పుస్తకాల్లో, గుళ్ల మీద బొమ్మల్లో, పాత సీరియల్స్ & సినిమాల్లో చూస్తూనే వచ్చాం. మరి అలాంటప్పుడు కొత్తగా రంభ, ఊర్వశి, మేనక లాంటి సెడక్టివ్ ఏంజెల్స్ కి కొత్తగా సంస్కారవంతమైన బట్టలు ఎలా వేస్తారు?.
సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతున్న “సీక్రెట్ సోల్జర్” అనే సినిమా అయితే ఏకంగా సెంట్రల్ సెన్సార్ బోర్డ్ దగ్గర 8 నెలలు ఆగిపోయింది. తొలుత చైనా పీస్ అంటూ ప్రమోట్ చేయబడిన ఈ సినిమాకి టైటిల్ మార్పించి, పేర్లు మ్యూట్ & బ్లర్ చేయించి.. ఎట్టకేలకు రిలీజ్ కి అనుమతి ఇచ్చారు.
అసలు ఏం జరుగుతోంది సెన్సార్ బోర్డులో? అడిగేవాళ్ళు లేరా? అడగట్లేదని పేట్రేగిపోతున్నారా? ఇక్కడ సమస్య కూడా ఫిలిం మేకర్స్ ఒక తాటి మీద నిల్చోకపోవడమే. కొందరేమో మాకేం సమస్య లేదు, చాలా బాగా చూసుకున్నారు సెన్సార్ మా సినిమాని అంటారు, కొందరేమో పూర్తి భిన్నంగా చెబుతారు. సెన్సార్ సభ్యుల అతి జాగ్రత్త.. ఫిలిం మేకర్స్ పాలిట శాపంగా మారిందా? ఇదే కంటిన్యూ అయితే సినిమాల పరిస్థితి ఏమవుతుంది? అనే విషయమై ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది.






