‘ప్రత్యేక హోదా’ అంటే సిఎం ఒక్కరికే పడుతుందా?

seemandhra political leadersరాష్ట్ర విభజన సమయంలో చొక్కాలు చించుకుని వీర సమైక్యవాదం వినిపించిన వీరులంతా ఇప్పుడేమయ్యారు? ఎక్కడికిపోయారు? అయితే అదంతా గతం. కనీసం ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడరు వారంతా? ఆ బాధ్యత కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుదే తప్ప తమకేం సంబంధం అన్నట్లుగా ఉంటే సరిపోతుందా? లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తే ప్రత్యేక హోదా వస్తుందా? అన్న ప్రశ్నలు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా అనేది కేంద్రం పరిధిలో వుందని అందరికీ తెలిసిందే. రాష్ట్రం తరఫున ఒక స్థాయిలో మాత్రమే ఒత్తిడి తేవడం సాధ్యమవుతుంది. కానీ, ఢిల్లీలో ఒత్తిడి తెస్తే కానీ హోదా సాధ్యం కాదు.. అలాంటప్పుడు సమైక్య పోరాట యోధులు, ఆంధ్ర ప్రయోజనాల కోసం పోరాడతామనే రాజకీయ నేతలు ఆ దిశగా కేంద్రంతో తలపడితే బాగుంటుంది. కానీ, ఆ పని ఎవరూ చేయడం లేదు. అప్పుడప్పుడూ ప్రకటనలు ఇవ్వడం.. లేదంటే చంద్రబాబుపై రాళ్లేయడం.. పరిపాటిగా మారింది.

ప్రత్యేక హోదా సమయంలో దీక్షలు చేసినవారు, ఆమరణ దీక్షలు చేస్తామని చెప్పినవారు అంతా ఇకనైనా బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో కొట్టాడితే ఫలితముంటుంది. చలాసాని శ్రీనివాస్ వంటి వారు ఇటీవల ఢిల్లీ వేదికగా నిరసనలు తెలియజేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. విభజనపై చర్చ సమయంలో కాలు దువ్వినట్లుగా కనిపించిన కొందరు పెద్దలంతా ఇప్పుడు ఇల్లు దాటి బయటకు రావడం లేదు. అసలు ఎక్కడున్నారో తెలియని మెగా హీరోలు మరికొందరు. చివరి బంతికి సిక్సర్లు కొడతామన్న పెద్ద మనుషులు అసలు ప్రేక్షకుల గ్యాలరీ కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు.

రాష్ట్రాన్ని విడగొట్టి ఒకటిన్నర సంవత్సరాలైనా వీరందరికీ ఇంకా టైం వచ్చినట్లుగా లేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు అక్కడకు వెళ్లి ఆందోళన చేసే ధైర్యమే వీరికి లేదా? సరే, అంత దమ్ము లేదనుకుంటే కనీసం నీతి ఆయోగ్ నైనా నిద్ర లేపొచ్చు కదా. నీతి ఆయోగ్ పరిశీలనలో ప్రత్యేక హోదా అంశం ఉందని కేంద్రం చెప్తున్నప్పుడు ఆ నీతి ఆయోగ్ ను సమైక్య సింహాలు, మేధావులు నిలదీయొచ్చు కదా. పోనీ మన మేధావులను వదిలేద్దాం…. ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో చొక్కాలు చించుకుంటాం అని చెప్పిన పెద్ద పార్టీల పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు.

సొంత గొడవలను పరిష్కరించుకోవాడానికి పార్లమెంటుకు అడ్డం పడుతున్నారు. మాపైనే కేసులు పెడతారా? నేనెవరి కోడలినో తెలుసా? అని ఒకరు… ఏయ్.. మా తాత ఎవరనుకున్నావ్? అంటూ ఇంకొకరు తొడలు కొడుతూ పార్లమెంటులో సొంత సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఇక ప్రత్యేక హోదా ఎవరికి పడుతుంది.. బడ్జెట్ కసరత్తులు మొదలవుతున్న తరుణంలో కేంద్రం, నీతి ఆయోగ్ మరో మూణ్నాలుగు నెలలు ఆ వంకతో తప్పించుకోవడం ఖాయంగా కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories