ఓ షార్ట్ ఫిల్మ్ “టైటిల్”పై ప్రస్తుతం సోషల్ మీడియాలో రగడ జరుగుతోంది. సాధారణంగా సినిమాలకు సంబంధించి ఇలాంటి ‘టైటిల్’ గొడవలు జరుగుతుంటాయి గానీ, ఈ సారి షార్ట్ ఫిల్మ్ కు ఈ రచ్చ అంటుకుంది. “సీత-ఐ యామ్ నాట్ ఎ వర్జిన్” అనే షార్ట్ ఫిల్మ్ టైటిల్పై పెను వివాదం రేగుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ కేసు నమోదు కావడంపై ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రధాన పాత్ర సీత పాత్ర ధారి, సోషల్ మీడియా డబ్ స్మాష్ స్టార్ దీప్తీ సునయన స్పందించింది.
“టైటిల్ ను చూసి కథ ఏంటో డిసైడ్ చేస్తామంటే ఎలా? వాస్తవానికి ఈ చిత్ర కథకు, పురాణాల్లో సీతాదేవికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అసలు టైటిల్ లేదా ట్యాగ్ లైన్ బాగుంటే… కథలో సీతాదేవిని తప్పుగా చూపించినా పర్లేదా? టైటిల్ ను చూసి నిర్ణయానికి రావడం తొందరపాటు అని, ఈ షార్ట్ ఫిల్మ్ లో సీత పాత్ర పోషించిన తాను మహిళను కాదా? తనకు సీతమ్మ వారి గురించి తెలియదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది సునయన.
“తాను కూడా ఒక హిందువునేనని, ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసే అంశాలు ఏవీ లేవని తెలిపింది. సీత అనే ఒక అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న అంశాల గురించి ఈ షార్ట్ ఫిలిం చెబుతుందని” దీప్తి సునయన స్పష్టం చేసింది. టైటిల్ ను సునయన ఎంతగా సమర్ధించుకొచ్చిందో, ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కౌషిక్ బాబు అలాగే స్పందిస్తూ… టైటిల్ ను మార్చే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మొత్తానికి ఈ వివాదంతో ఈ షార్ట్ ఫిల్మ్ కు కావలసినంత పబ్లిసిటీ దక్కుతోంది.



