ఇమేజ్ ఉంది.. పారితోషికం ఓకే… కానీ హిట్ పడుతోందా?

Senior Telugu Actors Urged to Break Image Trap

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ నటులు, వారి తర్వాత తరం నటులు కూడా ఓ స్థాయికు చేరుకొని అక్కడ లాక్ అయిపోయారని చెప్పక తప్పదు.

కనుక తమ స్థాయికి తగ్గట్లుగానే సినిమాలు చేయడం అవసరం లేదా తప్పనిసరి అని వారు భావిస్తున్నట్లున్నారు. అలా వాటితో లాక్ అయిపోయి, ఆ సినిమాలు ఫ్లాప్ అయితే వారు, వారి అభిమానులు కూడా మౌనంగా బాధపడుతుంటారు.

ADVERTISEMENT

వీరిలో వెంకటేష్, నాగార్జున మాత్రం ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. వారిరువురూ పాన్ ఇండియా మూవీలు తప్పనిసరి అనుకోరు.

చిరంజీవి విశ్వంభరతో ఎలా లాక్ అయిపోయారో అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఆయన కూడా తన పందా మార్చి అనిల్ రావిపూడితో ‘మన శంకరవర ప్రసాద్ గారు’ అంటూ సంక్రాంతికి వస్తుండటం అందరికీ చాలా సంతోషమే. మెగాస్టార్ తన పంధా మార్చితే ఎలా ఉంటుందో శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో ఎప్పుడో నిరూపించి చూపారు. ఇప్పుడు మళ్ళీ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ మరోసారి నిరూపించి చూపబోతున్నారు.

కనుక పవన్‌ కళ్యాణ్‌తో సహా మిగిలిన సీనియర్ నటులు కూడా ఈ ఇమేజ్ చట్రం నుంచి బయటపడి ‘హీరోయిజం లేని’ మామూలు సినిమాలు చేస్తే చూడాలనుకునే ప్రేక్షకులు కోకొల్లలున్నారు.

జాతి రత్నాలు, బలగం, తాజాగా లిటిల్ హార్ట్స్ వంటి చిన్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అవి ఆయా దర్శక నిర్మాతలు, నటీనటులకు మంచి లాభాలు, పేరు ప్రతిష్టలు ఆర్జించిపెట్టాయి.

అంటే చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ స్థాయి నటులు అటువంటి సినిమాలు చేయాలని కాదు కానీ తక్కువ బడ్జెట్‌తో మంచి కధ ఉన్న చిన్న సినిమాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అవి స్పష్టం చేస్తున్నాయి కదా?

చిరంజీవి, బాలకృష్ణ తదితరులు గతంలో వారు ఏడాదికి 6-7 సినిమాలు చేసేవారు. చాలా విలక్షణమైన కధలు, పాత్రలతో సినిమాలు చేసేవారు. వాటిలో చాలా సినిమాలు వంద, యాబై రోజులు పైనే ఆడాయి.

ఇప్పుడు చేస్తున్న సినిమాలతో వారికి భారీగా పారితోషికాలు వస్తున్నాయేమో కానీ ఆనాటి సినిమాలతోనే వారు పేరు ప్రతిష్టలు, అశేష ప్రజాధరణ, అభిమానులు సంపాదించుకున్నారు. ఈ విషయం వారికీ గుర్తుండే ఉంటుంది.

కనుక పెద్ద హీరోలందరూ తమిళ్, మళయాళ నటుల్లా తమ ఇమేజ్ చట్రంలో నుంచి బయటపడేందుకు ప్రయత్నించి, ఇదివరకులా తక్కువ బడ్జెట్‌, తక్కువ సమయంలో తెలుగు నేటివిటీతో ఉండే సినిమాలు చేయగలిగితే వారి నుంచి మరిన్ని మంచి మంచి అచ్చ తెలుగు సినిమాలు వస్తాయి. వారి సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా అద్భుతంగా సాగుతుంది.

ADVERTISEMENT
Latest Stories