వైసీపి అభ్యర్ధుల మార్పులు చేర్పుల జాబితాలో కొంతమందికి లాట్రీ తగిలిన్నట్లు అనూహ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కగా పార్టీలో అనేకమంది బలైపోయారు. ఇది అన్ని పార్టీలలో జరిగేదే కానీ వైసీపి అధికార పార్టీ కనుక చివరి నిమిషంలో టికెట్ చేజారినవారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంటుంది. అటువంటి వారిలో వైసీపి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కూడా ఒకరు. ఆయనకు జగన్ టికెట్ ఇవ్వకుండా బీసీ-రెడ్డి కులసమీకరణాలు వేసుకొని దీపికను అభ్యర్ధిగా ప్రకటించారు.
గత ఎన్నికలలో హిందూపురంలో బాలకృష్ణను ఢీకొనేందుకు ఎవరూ ముందుకు రానప్పుడు జిల్లా సీనియర్ నేతల్లో ఒకరైన షేక్ మహమ్మద్ ఇక్బాల్ అందుకు సిద్దపడ్డారు. గమ్మతైన విషయం ఏమిటంటే, గతంలో ఆయన ఐపిఎస్ అధికారిగా పనిచేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసరుగా పనిచేశారు. అయినా బాలకృష్ణపై పోటీ చేయడానికి వెనుకాడలేదు.
బాలకృష్ణ చేతిలో ఓటమి ఖాయమనే తెలిసే పోటీ చేశారు కనుక ఓడిపోయినందుకు ఆయనేమీ బాధపడలేదు. కానీ బాలకృష్ణపై పోటీ చేసినందుకు జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి హిందూపురం నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించారు.
అప్పటి నుంచే ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ బాలకృష్ణను ఢీకొని తప్పక ఓడించాలనే ఉద్దేశ్యంతో హిందూపురంలో వైసీపిని బలోపేతం చేసుకొంతున్నారు. కానీ నియోజకవర్గంలో నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ తదితర వైసీపి నేతలు ఆయనకు వ్యతిరేకంగా ముఠాగా తయారయ్యి టికెట్ రాకుండా అడ్డుపడిన్నట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన షేక్ మహమ్మద్ ఇక్బాల్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఆ లేఖను నేరుగా జగన్మోహన్ రెడ్డికే పంపారు.
తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పార్టీలో కొందరు కుట్రలు చేస్తుంటే, వారి గురించి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళినప్పటికీ ఆయన వారిని నియంత్రించకపోగా వారి మాటాలే నమ్మి తనను పక్కన పెట్టడాన్ని అవమానంగా భావిస్తున్నానని షేక్ మహమ్మద్ ఇక్బాల్ చెప్పారు. పార్టీలో గౌరవం లేనప్పుడు ఇంకా దానిలో కొనసాగడం దేనికని రాజీనామా చేశానని షేక్ మహమ్మద్ ఇక్బాల్ చెప్పారు.




