వైసీపీ లో షర్మిల రీ ఎంట్రీ, అన్న చెల్లెళ్ళ మధ్య పంచాయితీకి ఎండ్ కార్డు పడింది, వైఎస్ కుటుంబం తిరిగి ఒక్కటవ్వనుంది అంటూ గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారుల నుంచి ఒక బలమైన ప్రచారం జరుగుతుంది.
అయితే షర్మిల వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని జగన్ ఎదురు చూస్తున్నారా.? ఆయన ఎదురు చూపులనే వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులు అక్షరాలుగా మలుస్తున్నారా.? కథనాలుగా ప్రచారం చేస్తున్నారా.? తమ ఊహాగానాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా.?
2019 ఎన్నికల వరకు వైసీపీ గెలుపు కోసం జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన షర్మిల వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితులేందుకు వచ్చాయి అనేదానికి ఇప్పటికి వైసీపీ వద్ద సరైన సమాధానం లేదనే చెప్పాలి.
జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం ‘బై బై బాబు’ అన్న షర్మిల ను ‘బాబు మనిషి’ అంటూ ముఖ్యమంత్రిగా జగన్ షర్మిల ను టార్గెట్ చేసారు. నాడు షర్మిల పొలిటికల్ ఎంట్రీ కి కారణమైన జగన్ నాటి షర్మిల వైసీపీ ఎగ్జిట్ ని ఆపలేకపోయారు. నాడు షర్మిల ఎగ్జిట్ వైసీపీ కి ప్రమాదం కాదు అనుకున్న జగన్ నేడు పార్టీలోకి షర్మిల రీ ఎంట్రీ అవసరం అని భావిస్తున్నారా.?
అందుకే తన భావాలను వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారుల మాటలతో షర్మిలకు వినపడేలా, కనపడేలా చేస్తున్నారా అన్న చర్చ నడుస్తుంది. షర్మిల ఎంట్రీ వైసీపీ కి రాజకీయ బలంగా మారితే అదే షర్మిల ఎగ్జిట్ వైసీపీ ని బలహీనం చేసింది.
అయితే పార్టీలోకి షర్మిల రీ ఎంట్రీ వైసీపీ కోల్పోయిన బలాన్ని తిరిగి సాధిస్తుందని జగన్ విశ్వసిస్తున్నారా.? అందులో భాగంగానే సోదరి షర్మిలకు జగన్ పరోక్షంగా సోషల్ మీడియా సందేహాలు పంపుతున్నారా.? అన్న వాదన వినిపిస్తుంది. అయితే షర్మిల మాత్రం తానూ ఇప్పటికి, ఎప్పటికి వైసీపీ కి దూరమే అన్న సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో వైసీపీ ఈ ప్రచారానికి ఇక్కడితో శుభం కార్డు వేస్తుందా.? లేదా పార్ట్ – 2 అంటూ మళ్ళీ మొదలుపెడుతుందా.?





