ఇటీవల కేరళ రాష్ట్రం పేరు ‘కేరళం’గా మారింది. వారికి తమ సంస్కృతి, సంప్రదాయాలు, భాష అంటే చాలా అభిమానం, గౌరవం కూడా. అందుకే ఇద్దరు మలయాళీలు కలిస్తే చక్కగా మళయాళంలోనే మాట్లాడుకుంటారు. అందుకు వారు మనలాగ సిగ్గుపడరు. గర్వపడతారు. సంతోషపడతారు.
వారి మాటలలోనే కాదు.. వారి రోజువారి జీవితంలో, వారి సినిమాలలో కూడా వారి భాషాభిమానం, సంస్కృతీ సంప్రదాయాల పట్ల గౌరవం ఉట్టి పడుతుంటుంది. వాటిని అలాగే లోకానికి చూపించి మెప్పిస్తుంటారు కూడా.
ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రముఖ ప్రవచన బ్రహ్మ గరికపాటివారు స్పందిస్తూ, “మన ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ‘తెలుగునాడు’గా మార్చుకోవాలి. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాగ మన ఆంధ్రా పక్కన ఆ హిందీ పదం ‘ప్రదేశ్’ దేనికీ? ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చాలని కోరుతున్నా,” అని అన్నారు.
దేశంలో విపరీతమైన భాషాభిమానం కలిగినవారిలో తమిళులు, మలయాళీలు, కన్నడిగులు, బెంగాలీలు, మరాఠీల గురించి చెప్పుకుంటాము.
కానీ ఏ మాత్రం భాషాభిమానం లేనివాళ్ళు ఒక్క తెలుగువాళ్ళు మాత్రమే అంటే తెలుగు చదవడం, వ్రాయడం, మాట్లాడటం రాని తెలుగువారికి కూడా కోపం పోడుచుకొచ్చేస్తుంది. మనోభావాలు దెబ్బ తినేస్తాయి.
కానీ ఇంట్లో పిల్లలతోనే కాదు.. పెంపుడు కుక్కలతో కూడా ఇంగ్లీషులో మాట్లాడేవాళ్ళు మన తెలుగువాళ్ళు మాత్రమే అంటే కాదనగలరా?
ఎందుకంటే కుక్కలకి తెలుగు అర్థం కాదు కనుక ఇంగ్లీషులోనే మాట్లాడితేనే వాటికి అర్థమవుతుందనా?అంటే కాదు… సాటి తెలుగువారితోనే ఇంగ్లీషులో మాట్లాడటం గొప్పగా, హుందాగా ఉంటుందనే నిశ్చితాభిప్రాయం ఉన్నప్పుడు కుక్కలతో ఇంగ్లీషులో మాట్లాడటంలో విచిత్రం ఏముంది?
ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చుకోవాలంటే కేరళం లేదా మరో రాష్ట్రాన్ని చూసి కాదు. మనలో భాషాభిమానం తన్నుకు వచ్చినప్పుడు. అదేన్నటికీ రాదు. ఉన్నది పోకుండా కాపాడుకోగలిగితే అదే పదివేలు.
దాని కోసం ముందు తెలుగులో వ్రాయడం, చదవడం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు కనుక కనీసం పిల్లలకైనా నేర్పించాలి. సాటి తెలుగువారితో, ఇంట్లో పిల్లలతో కుక్కలతో సహా అందరితో తెలుగులోనే మాట్లాడటం అలవాటు చేసుకోవాలి.
ఇవన్నీ సాధ్యం కాదనుకుంటే ఆంధ్రప్రదేశ్ పేరు మార్చుకోవాల్సిన అవసరమే లేదు. అలా ఉన్నా వచ్చే నష్టం లేదు. అంత్య నిష్టూరం కంటే అది నిష్టూరమే మేలు కదా?







