ముల్లుని ముల్లుతోనే తీయక తప్పదన్నట్లు పాకిస్తాన్‌ని కట్టడి చేసేందుకు భారత్ ప్రభుత్వం తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహం చేసేందుకు సిద్దపడింది. ఇది సరైన నిర్ణయమా కాదా?అనేది కాలమే చెపుతుంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలున్నప్పుడు, అప్పటి ప్రభుత్వానికి భారత్ అండగా నిలబడింది. ఆ దేశంలో అనేక అభివృద్ధి పనులు చేసింది. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో కరడుగట్టిన తాలిబాన్ తీవ్రవాదులు ప్రభుత్వం నడుపుతున్నారు.
నాలుగైదేళ్ళ క్రితం వరకు తుపాకులు పట్టుకొని తిరిగిన తాలిబన్లు ఇప్పుడు తెల్ల దుస్తులు ధరించి ప్రభుత్వం నడిపిస్తుంటే వారి బుద్దులు, ఆలోచనలు మారిపోతాయా? అంటే కాదనే చెప్పాలి. వారు తమ దేశ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు నరకం చూపిస్తున్నారు. సొంత ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరిస్తున్నవారు ఇరుగుపొరుగు దేశాలతో మంచిగా ఉంటారా? వారు తాలిబాన్ తీవ్ర వాదులు కనుకనే ప్రపంచ దేశాలు వారి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకునేందుకు ఇష్టపడటం లేదు. కానీ వారితో భారత్ స్నేహం చేయాలనుకుంటోంది. అవసరమా?
భారత్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మవలావి అమీర్ షారూక్ ఖాన్ ముత్తాఖి శుక్రవారం ఢిల్లీకి వచ్చారు. ఆయనతో భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సమావేశమయ్యారు.
తర్వాత భారత్ ప్రజల తరపున ఆఫ్ఘనిస్తాన్‌కి 5 అంబులెన్సులు బహుమతిగా అందజేశారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులు ఎవరినీ అనుమతించలేదు! అంటే పాము పామే అన్నట్లు తాలిబాన్ తాలిబానే అనుకోవాలేమో?
మంత్రుల వేషంలో వచ్చిన తాలిబాన్ వ్యక్తికి భారతీయ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ షేక్ హ్యాండ్ ఇవ్వడం, కలిసి ఫోటోలు దిగడం, మీడియా సమావేశం నిర్వహించడం ద్వారా దేశ ప్రజలకు, ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి.
పాక్‌ని కట్టడి చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లతో స్నేహం అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుంది లేకుంటే వారితో స్నేహం దేనికి?
కానీ ఇదెలా ఉందంటే భారత్‌ని కట్టడి చేయడానికి ట్రంప్, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ని చంక నెక్కించుకున్నట్లే ఉంది.




