సినిమాల మీద మన తెలుగు ప్రేక్షకుల మక్కువ తెలియనిది కాదు. ప్రపంచమంతా కరోనాతో సతమతమవుతుంటే, సినీ ఇండస్ట్రీని ‘బాహుబలి’ లాగా చేతులెత్తి నిలబెట్టిన ఘనత తెలుగు ప్రేక్షకులకే చెల్లుతుంది. అలాంటి ఆడియన్స్ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ కు ముఖం చాటేసారు.
ప్రస్తుతం టాలీవుడ్ కు గడ్డు కాలం నడుస్తోంది. ప్రతి వారం మూడు, నాలుగు చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి గానీ, అవి బావున్నాయా? లేదా? అన్న టాక్ ను కూడా పట్టించుకునే దశలో సినీ ప్రేక్షకులు ఉన్నట్లుగా కనపడడం లేదు. ప్రస్తుతం సినీ వినోదానికి ప్రత్యామ్నాయంగా ప్రేక్షకులకు చాలా వినోదాలు అందుబాటులో ఉండడమే ప్రధాన కారణం.
ఏ ఇద్దరూ కలిసినా మొదటగా చర్చకు వచ్చేది రాజకీయమే. ఏపీలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి గెలుస్తుందా? రెండోసారి జగన్ జయకేతనం ఎగరేయగలుగుతారా? కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారా? తెలంగాణా లోక్ సభ పోటీలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ వర్గం నిలువరించగలుగుతుందా?
ఇలా ఎవరికీ తోచిన అభిప్రాయాలతో వారు చర్చలు జరుపుతుండగా, వాటికి అనుబంధంగా వచ్చే వార్తలు, సర్వేలు ప్రజల్లో పొలిటికల్ ఉత్సాహానికి ఊతమిస్తున్నాయి. దీంతో సినీ వినోదం సైడ్ ట్రాక్ లోకి వెళ్లి, రంగులు మార్చుకునే రాజకీయం రాజ్యమేలుతోంది. పొలిటికల్ పండగ ఇలా ఉండగా, మరోవైపు ఐపీఎల్ రూపంలో మరో వినోదం అందుబాటులోకి వచ్చింది.
క్రికెట్ ను మతంగా భావించే ఇండియాలో ఐపీఎల్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా విశదీకరించనవసరం లేదు. ఐపీఎల్ జరిగే 50 రోజుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ రూపంలో చేతులు మారతాయనే ప్రచారం ఎప్పటి నుండో ఉంది. ‘జులాయి’ వంటి సినిమాలలో ఐపీఎల్ క్రేజ్ ను ప్రేక్షకులకు ప్రత్యక్షంగా కనువిందు చేసారు కూడా!
అలాంటి ప్రారంభం అయ్యి నాలుగు రోజులే అయ్యింది. మరో 45 రోజుల పాటు ఇంకా ఐపీఎల్ కొనసాగనుంది. సాయంత్రం ఏడయ్యే సరికి నేటి మ్యాచ్ ఎవరిది? అనే లోకంలోకి క్రికెట్ అభిమానులు వెళ్లిపోయే పరిస్థితి రావడంతో, ‘సెన్స్ లెస్ కామెడీ’గా పేరు తెచ్చుకున్న “ఓం భీం బుష్” లాంటి సినిమాలకు కూడా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో పట్టం కట్టలేని పరిస్థితి.
ఇవి కాక మార్చి, ఏప్రిల్ మాసాలకు కేరాఫ్ అడ్రస్ విద్యార్థుల ఫైనల్ ఎగ్జామ్స్. పరీక్షలతో పిల్లలు, వారిని చదివించుకునే పనిలో తల్లితండ్రుల ఆపసోపాలు. దీంతో సిల్వర్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకులకు కాస్త దూరం అయ్యింది. ఇదంతా తెలిసిన సినీ నిర్మాతలు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమ బొమ్మలను ప్రదర్శించే పనిలో ఉన్నారు.
ఈ వారం మరో నాలుగైదు సినిమాలు రిలీజ్ కు సిద్ధం కాగా, అందులో “టిల్లు స్క్వేర్” కూడా ఉంది. “డీజే టిల్లు”తో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న సిద్ధు, అదే క్యారెక్టర్ తో మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతమున్న పొలిటికల్, క్రికెట్ పండగలను అధిగమించి సిద్ధు వినోదాన్ని అందించగలరో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు ముగియాలి.




