సినిమా అంటే భారీ బడ్జెట్.. స్టార్ హీరో.. వందల కోట్ల మార్కెట్.. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో విజయానికి కొలమానంగా మారినట్లు కనిపిస్తుంది. సినిమా యావరేజ్ అయినా, హిట్ కాకపోయినా మళ్ళీ పరువు కాపాడుకునే ప్రయత్నంలో అబద్దపు కలక్షన్స్ రిపోర్ట్స్ వేసుకోవడం, జరిగిన నష్టం చాలదన్నట్లు మళ్ళీ సక్సస్ మీట్ పెట్టుకొని నవ్వులపాలవడం చూస్తున్నప్పుడు జాలి కలుగుతుంది.
ఇదే సమయంలో చిన్న సినిమాలు మాత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.
ఇటీవల విడుదలైన ‘హనుమాన్ అంశ్’, ‘లాలో-కృష్ణ సదా సహాయతే’ రెండూ చిన్న సినిమాలే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్ ’.. రూ.100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి సంచలనం సృష్టించింది.
గుజరాతీ చిత్రం ‘లాలో’ అయితే కేవలం రూ.50 లక్షల రూపొందిస్తే అది కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. ప్రేక్షకుల మనసులను తాకే భక్తి, భావోద్వేగం, బలమైన కథ ఉంటే భాషలు, ప్రాంతాల సరిహద్దులు దాటేస్తాయని ఇవి రెండూ నిరూపించాయి.
తెలుగులోనూ ‘హనుమాన్’, ‘బేబీ’ వంటి చిత్రాలు కంటెంట్ ఉంటే చిన్న, మధ్యస్థ బడ్జెట్ సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకోగలవో చూపించాయి.
వరుస ఫ్లాపులతో దెబ్బ తిన్న రవితేజ మాస్ ఇమేజ్, మళ్ళీ ‘ఇరుముడి’ వంటి సింపుల్ సినిమాతో పతాక స్థాయికి చేరుకుంది కదా?
మరి ఇలాంటి సినిమాలు ఇంతటి ఆదరణ పొందుతున్నప్పుడు.. ఇంత తక్కువ పెట్టుబడితో ఇంత భారీ కలెక్షన్స్ రాబడుతున్నప్పుడు, ఇంత పేరు ప్రతిష్టలు ఆర్జించి పెడుతున్నప్పుడు, స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు ఇంకా రొటీన్ కథలనే నమ్ముకుంటూ ఆపసోపాలు పడాల్సిన అవసరం ఏమిటి? అంటే వారందరూ తమతమ ఇమేజ్ చట్రాలలో చిక్కుకుపోయారు కనుక అంత కంటే తక్కువ రేంజ్ సినిమాలు చేయలేరు గాబట్టి అని అనుకోవాల్సి ఉంటుంది.
అది వారి దురదృష్టం అనుకుంటే, వారి ఈ దురదృష్టమే చిన్న హీరోలు, దర్శక నిర్మాతలకు అదృష్టంగా మారుతోంది. వారు వదిలేసిన ఈ స్పేస్‌ని సద్వినియోగం చేసుకుంటూ చకచకాపైకి ఎదుగుతున్నారు. వేణు ఎల్దండి, హర్ష్ రోషన్, ప్రియదర్శి వంటి అనేకమంది కళ్ళెదుటే కనబడుతున్నారు కదా?
ఒక భారీ బడ్జెట్ సినిమా తీసి రిస్క్ తీసుకునే బదులు అదే బడ్జెట్‌తో 5 లేదా 10 చిన్న సినిమాలు చేస్తే వాటిలో కొన్ని హిట్ అయినా లాభదాయకమే కదా? పైగా చిన్న సినిమాలు చేస్తారు ప్రోత్సహిస్తారనే మంచి పేరు కూడా వస్తుంది కదా?
సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో, మళ్ళీ ఓ వంద సినిమాలు దాటేసిన తర్వాత ప్రతీ హీరో ప్రయోగాలు చేయడం పరిపాటి.
జగపతి బాబు, మోహన్ బాబు, సునీల్, అల్లరి నరేష్ వంటి నటులు హటాత్తుగా తమకున్న ఇమేజ్ వదిలించుకొని ప్రయోగాలు చేస్తూ శభాష్ అనిపించుకుంటుతున్నప్పుడు పెద్దలకు భయమెందుకు?
కొండకు వెంట్రుక ముడేసి లాగితే వస్తే కొండ వస్తుంది లేకుంటే పోయేది వెంట్రుకే అనుకోని ప్రయత్నిస్తే తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరిన్ని అద్భుతమైన సినిమాలు తప్పక వస్తాయి.





