ఈ మధ్యనే రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కొత్త అధ్యక్షులను నియమించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ కు సోము వీర్రాజును, తెలంగాణ కు బండి సంజయ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా నియమించింది హై కమాండ్. రాష్ట్ర సారథిగా బండి సంజయ్ తొలి పరీక్షలోనే డిస్టింక్షన్ సాధించారు.
తెరాస కంచుకోట ఐనటువంటి దుబ్బాకలో పార్టీని గెలిపించి తన సత్తా చాటుకున్నారు సంజయ్. ఏడాది కిందట జరిగిన హుజూర్‌నగర్ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకే చుక్కలు చూపించి, సంజయ్ సత్తా చాటా చాటారు. ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ లోని సోము వీర్రాజు పై ఒత్తిడి పెరుగుతుంది.
ఇటీవలే తిరుపతి సిట్టింగ్ ఎంపీ కరోనా కారణంగా మృతి చెందడంతో అక్కడ ఉపఎన్నిక రావడం ఖాయం. అక్కడ గెలిస్తే వీర్రాజు పరువు దక్కుతుంది. అయితే అది అంత తేలిక కాదు. అధికార పార్టీ బలంగా ఉండటం తో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా అక్కడ గట్టి పోటీ ఇవ్వనుంది. గెలవడం మాట అటుంచితే చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వడం కూడా కష్టమే.
జనసేన పొత్తు కారణంగా గౌరవప్రదమైన ఓట్లు రాబట్టుకోవచ్చు. అయితే ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుందా లేదా రిస్క్ ఎందుకని జనసేనకు వదిలి పెడుతుందా అనేది చూడాలి. ఇప్పటికిప్పుడు బీజేపీకి అక్కడ సరైన అభ్యర్థి కూడా లేడు. దీనితో వీర్రాజు మీద విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశం లేకపోలేదు.





