‘నేషనల్ హెరాల్డ్’ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ పాటియాలా హౌస్ కోర్టుకు శనివారం హాజరు కానున్నారు. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సోనియా, రాహుల్ కోర్టును కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలుత అక్బర్ రోడ్‌లో వున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి పాటియాలా కోర్టు వరకు ర్యాలీగా వెళ్లాలని నేతలు నిర్ణయించినప్పటికీ, ‘కోర్టు విచారణలో పార్టీ జోక్యం సరికాదన్న’ న్యాయ నిపుణుల సలహాతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రాంగణం వద్ద 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించగా, ఈ ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ బ్యూరో స్వయంగా పరిశీలించింది.
ఇంతకీ సోనియా, రాహుల్ లు ఎదుర్కొంటున్న “నేషనల్ హెరాల్డ్” కేసు ఏమిటి..? వారు ఎందుకు న్యాయస్థానం ముందుకు వస్తున్నారు..? అన్న సందేహాలు సామాన్యుల మదిలో మెదిలే ఆలోచనలు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే… నేషనల్ హెరాల్డ్ పత్రిక సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌కు కాంగ్రెస్ 90.25 కోట్ల రుణాన్ని ఇచ్చింది. 2010 డిసెంబర్ 10న ఈ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) అనే చారిటీ సంస్థకు పార్టీ 50 లక్షలకు అప్పగించింది.
ఇంత పెద్ద మొత్తాన్ని వసూలు చేసే హక్కును వైఐఎల్‌కు రూ.50 లక్షలకే అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఉద్దేశాలపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. మరో వైపు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా ఇదే అంశాలను లేవనెత్తారు. అంతేకాదు వైఐఎల్‌లో సోనియా, రాహుల్‌లకు చెరో 38 శాతం వాటా ఉన్నట్లు ఆయన ప్రధాన ఆరోపణ. హెరాల్డ్‌కున్న ఆస్తులను చట్టబద్ధంగా సోనియా కుటుంబం సొంతం చేసుకుందంటూ స్వామి పిటిషన్ మేరకు కాంగ్రెస్ నేతలపై చీటింగ్ కేసు నమోదైంది. ఇదీ “నేషనల్ హెరాల్డ్” కేసు కధ కమామీషు!





